వనజీవి ఈ పేరు వినగానే మనకు రామయ్య గుర్తుకు వస్తారు. కానీ మనకు మరో వనజీవి ఉన్నారు. మొక్కల కోసం ప్రాణం పెడుతూ పర్యావరణ హితుడిగా పేరుగాంచారు పోచయ్య.
ఇరవై ఏళ్లలో నలభై వేల మొక్కలు..
కుమురం భీం జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన పులబోయిన పోచయ్య పశువుల కాపరి. అడవిలో పశువులకు ఆహారం దొరక్క పొలాల్లోకి వెళ్తున్నాయని గ్రహించాడు. అడవిలో మొక్కలు నాటాలని నిర్ణయించాడు. ఇరవై ఏళ్లలో నలభై వేల మొక్కలు నాటాడు వనజీవి పోచయ్య. ఆయనకు పశువులను మేపితే తప్ప ఆదాయం రాదు. ఒక పక్క కుటుంబాన్ని పోషిస్తూ.. మరోపక్క కొన్నివేల మొక్కలు నాటాడు. పోడు వ్యవసాయం కోసం స్థానికులు చెట్లను నరుకుతుంటే నిలువరించాడు. రైతులు, గ్రామస్థులతో గొడవలూ జరిగాయి. ఎంతమంది అడ్డుపడ్డా.. ఖాళీ స్థలంలో మొక్కలు నాటుతూనే వచ్చాడు.
అటవీ సంరక్షణే ధ్యేయం
మొక్కలు నాటడం, అడవిని సంరక్షించడమే వ్యాపకంగా పెట్టుకుని.. నర్సరీల పెంపకం చేపట్టాడు. 20 ఎకరాల్లో మొదలైన మొక్కల పెంపకం.. 100 ఎకరాలకు విస్తరించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వన సంరక్షణకు పోచయ్య చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
అటవీ వాచర్గా...
వన సంరక్షణ, పోడు వ్యవసాయం పేరిట చెట్లను నరకడాన్ని అడ్డుకున్న పోచయ్యను గుర్తించిన ఓ అటవీశాఖ అధికారి తాత్కాలిక అటవీ వాచర్గా నియమించారు. కార్యసాధనలో మరింత జోరు పెంచి అటవీ రక్షణలో సఫలమయ్యాడు.
సరైన గుర్తింపు లేదు..
అడవుల నరికివేత, పోడు భూముల ఆక్రమణలు అడ్డుకోవడమే కాకుండా సొంత ఖర్చులతో మొక్కలు నాటిన ఈ వన ప్రేమికుడికి తగిన గుర్తింపు మాత్రం దక్కలేదు. మూడు ఎకరాల భూమి తప్ప మరో ఆధారం లేదు. 16 ఏళ్లుగా తాత్కాలిక పద్ధతిలో వాచర్గా పనిచేస్తున్నా ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించలేదు. జీతం కూడా తగిన స్థాయిలో ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు.
వనజీవి రామయ్యలాగే పోచయ్య సేవలనూ గుర్తించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్