ప్రధాని మోదీ... దేశవ్యాప్తంగా ఆయన అనుకుంటే వెళ్లలేని ప్రాంతం ఉండదు. గత 29 ఏళ్లలో ఎన్నో దేశాలు, ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చిన ఆయన... అయోధ్యలో మాత్రం అడుగుపెట్టలేదు. ఇందుకు కారణం ఏంటన్నది.. ప్రత్యర్థి పార్టీలు, ప్రజలకు ఎప్పుడూ సమాధానం దొరకని ప్రశ్నే. అయితే తాజాగా దానిపై స్పష్టత వచ్చింది. రాముని జన్మస్థలంలో మోదీ అడుగుపెట్టకపోవడానికి కారణాన్ని ఓ పాత్రికేయుడు వెల్లడించారు.
ఇదీ కారణం...!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిరానికి భూమిపూజ జరగనుంది. ప్రధాని మోదీ ఈ వేడుకకు ప్రత్యక్షంగా, ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 29 ఏళ్ల క్రితం సాధారణ భాజపా కార్యకర్తగా అయోధ్యలో అడుగుపెట్టిన ఆయన.. మళ్లీ మందిరం నిర్మించినప్పుడే వస్తానని ఓ జర్నలిస్టుతో చెప్పారట. ఆనాటి శపథాన్ని నిజం చేస్తూ ప్రధానిగా అక్కడ భూమిపూజకు వెళ్లనున్నారు.
ఫొటోతో సాక్ష్యం..
1991లో మోదీ రామ్ లల్లా జన్మోత్సవం కోసం అయోధ్య వచ్చారు. ఆ కార్యక్రమం ఫొటోను స్థానిక ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠీ తీశారు. అందులో మోదీతో పాటు మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి ఉన్నారు. అయోధ్యలో మందిరం నిర్మించినప్పుడే మళ్లీ వస్తానని మోదీ గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా ఆ ఫొటోతో గుర్తుచేసుకున్నారు త్రిపాఠీ. అందుకే 1991 నుంచి 2020 మధ్య కాలంలో మోదీ ఒక్కసారి అయోధ్యను సందర్శించలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేసిన మోదీ.. ప్రధాని స్థాయిలోనే తొలిసారి అయోధ్యలో అడుగుపెట్టనున్నారు.
మహేంద్ర తిపాఠీ.. బాబ్రీ కేసులో సాక్షిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు లఖ్నవూలోని సీబీఐ కోర్టులో నడుస్తోంది. 29 ఏళ్ల క్రితం మోదీని కలిసిన త్రిపాఠీని.. రామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ భూమి పూజకు పిలిచే అవకాశముంది.