సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలు చితికిపోతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... తెరాస పాలనపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు ఆదిలాబాద్ పేరు చెపితే పోరాట యోధులు గుర్తుకు వచ్చేవారని కానీ ప్రస్తుతం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే నేతలు గుర్తుకు వస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న రేవంత్... కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా వేల కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.
కేసీఆర్ రాచరిక పాలనను అంతమొందించాలన్న రేవంత్‌రెడ్డి.. ఇకపై కాంగ్రెస్‌లో పార్టీని నమ్ముకున్న వారికే పదవులు వస్తాయని చెప్పారు. ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన రెండో సభ నిర్వహించనున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. స్వేచ్ఛ, స్వయం పాలన కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఇందిరమ్మ పాలనలోనే ఎస్సీలకు అసైన్డ్ భూములు వచ్చాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలి..
హుజూరాబాద్‌లో అమలు చేస్తోన్న దళిత బంధును అన్నీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దళిత బంధులాగే ఎస్టీలకు ఒక పథకం అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ తెచ్చిన అటవీహక్కుల చట్టాన్ని తెరాస కాలరాసిందని మండిపడ్డారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించిన భట్టి.. ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి