ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 2022 జనవరి ఒకటి అర్హతా తేదీతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు సవరణ ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నారు. జాబితాలో ఉన్న పొరపాట్లను సవరించడం, పునరావృతమైన పేర్ల తొలగింపు తదితర ప్రక్రియలతో పాటు బీఎల్వోల ద్వారా ఇంటింటి తనిఖీ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర ప్రక్రియలను ఈ గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
నవంబర్ ఒకటో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. దానిపై నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. వాటన్నింటిని డిసెంబర్ 20వ తేదీలోగా పరిష్కరిస్తారు. 2022 జనవరి ఐదో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. సవరణ ప్రక్రియకు ఓటర్లందరూ సహకరించాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. 2022 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. www.nvsp.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ ఓటుహక్కుతో పాటు మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: KRMB, GRMB Boards Meeting: ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం