రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ED attaches Assets in ESI Scam) కుంభకోణంలో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్‌రెడ్డి ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.
భారీగా ఆస్తుల జప్తు..
దేవికారాణికి చెందిన 17 కోట్ల 26 లక్షల విలువైన ఆస్తులు, నాగలక్ష్మికి చెందిన రూ.2 కోట్ల 45 లక్షల ఆస్తులు, 74 లక్షల 8వేల విలువైన పద్మ ఆస్తులను ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది. ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబుకు చెందిన రూ.119 కోట్ల 89 లక్షలు, పందిరి రాజేశ్వర్‌రెడ్డికి చెందిన రూ.4 కోట్ల 7 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.
మొత్తం రూ.211 కోట్లు
ఐఎంఎస్ కుంభకోణానికి (ఇండియన్ మెడికల్ స్కాం) సంబంధించి రాష్ట్ర అనిశా అధికారులు.. ఎనిమిది కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఎంఎస్ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సుమారు రూ.211 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు అనిశా అభియోగాలు నమోదుచేసింది. వాస్తవ ధర కన్నా నాలుగైదింతలు ఎక్కువకు కొనుగోలు చేసి.. అక్రమంగా పొందిన లాభాలతో భారీగా నగలు, ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలున్నాయి. దేవికారాణి, నాగలక్ష్మి... పీఎంజే జ్యూవెలర్స్ నుంచి సరైన రశీదులు లేకుండా రూ.6 కోట్ల 28 లక్షల విలువైన నగలు కొనుగోలు చేసినట్లు అభియోగం నమోదుచేసింది.
అందుకే జప్తు చేశాం..
అనిశా విచారణ లభించిన ఆధారాలతో మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (money laundering in ESI scam) దర్యాప్తు చేస్తోంది. గతంలో నిందితులతో పాటు అప్పటి కార్మికశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి, పీఎస్ ముకుంద రెడ్డి ఇళ్లల్లోనూ సోదాలు చేసి దాదాపు కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నా.. నిందితులందరూ బెయిల్‌పై విడుదలైనందున ఆస్తులను అమ్మే అవకాశం ఉందని అందువల్లే ఆయా ఆస్తులను తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
ఔషధాల కొనుగోళ్లలో 2015 నుంచి 2019 వరకు దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో ఈడీ తేల్చింది. నిందితులు కూడబెట్టుకున్న అక్రమాస్తుల్లో ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాలో 131 స్థిరాస్తులను గుర్తించినట్లు తెలిపింది. వాటిలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 వాణిజ్య సముదాయాలు, ఆరు వ్యవసాయ భూములు, 4 ఫ్లాట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. సెక్యూరిటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి చరాస్తులూ ఉన్నాయని ఈడీ తెలిపింది. కేసులో మరికొందరు అనుమానితుల మనీలాండరింగ్ ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
ఇదీచూడండి: