Table Tennis Commonwealth Games: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది. ఆటల ఐదో రోజు(మంగళవారం) జోరు మీద ఉంది. తాజాగా రెండు స్వర్ణాలు, రెండు రజతాలు భారత్ ఖాతాలో చేరాయి. భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీం పసిడితో మెరిసింది. సింగపూర్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. దీంతో.. భారత్ ఖాతాలో ఐదో గోల్డ్ చేరింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో.. భారత స్టార్ వికాస్ ఠాకుర్ సిల్వర్ గెలుపొందాడు. మొత్తం 346 కిలోల బరువును ఎత్తి.. రెండో స్థానంలో నిలిచాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మొత్తం పతకాల సంఖ్య 13కు (గోల్డ్ 5, రజతం 5, కాంస్యం 3) చేరింది.
మంగళవారమే.. లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 17-10 తేడాతో గెలిచింది భారత్. లవ్లీ చౌబే, రూపా రాణి, పింకీ, నయన్మోని సైకియాలతో కూడిన భారత లాన్ బౌల్స్ బృందం ఈ ఘనత సాధించింది. సోమవారం న్యూజిలాండ్‌ను ఓడించి వీరు ఫైనల్‌కు చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన ఈ బృందం ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం కొల్లగొట్టింది.
బ్యాడ్మింటన్‌లో రజతం..
గత కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ స్వర్ణం గెలిచిన భారత బృందం.. ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. మలేసియాతో ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 1-3తో ఓటమి పాలైంది. ఈ పోరులో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మొదట పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ 18-21, 15-21తో ఫాంగ్- వూయి చేతిలో ఓడిపోయింది.
ఈ స్థితిలో సింధు.. మహిళల సింగిల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె 22-20, 21-17తో జిన్ వీపై గెలిచి జట్టును రేసులో నిలిపింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21తో జి యాంగ్ చేతిలో ఓటమి పాలవడంతో భారత్ మళ్లీ 1-2తో వెనుకబడింది. కీలక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రెసా జాలీ జోడీ 18-21, 17-21తో తిన్నయ-పియర్లీ జంట చేతిలో పరాజయం పాలవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.