రాజస్థాన్‌లో ఓ యువకుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ అప్పుల వాళ్ల నుంచి చంపేస్తామని బెదిరింపులు రావడం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అల్వార్ జిల్లాకు చెందిన ఇమామ్ ఖాన్ కుటుంబం నాహర్పుర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇమామ్ సంవత్సరం క్రితం.. జాహుల్ అనే ఓ వ్యక్తి నుంచి రూ.35వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి వడ్డీ విధించి.. రూ.4.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు జాహుల్. కొద్దిరోజులుగా డబ్బుల కోసం ఇమామ్‌పై ఒత్తిడి తెస్తూ చంపేస్తానని బెదిరించేవాడు.
డిసెంబర్ 3న జాహుల్ తన సహచరులతో ఇమామ్‌ను బెదిరించడానికి ఇంటికి వచ్చాడు. వారిని చూసిన ఇమామ్ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనతో ఇమామ్ తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం నుంచి తిరిగి వచ్చిన ఇమామ్ అన్న జావేద్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడ్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు జాహుల్, అతని సహచరులపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇమామ్, జాహుల్ మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్‌ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై ఫుఖారాజ్ వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.
కన్నబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి..
కర్ణాటకలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కన్న తల్లే తన ఇద్దరు చిన్నారులను చంపడానికి ప్రయత్నించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఈ ఘటన కోలార్ జిల్లాలోని ములబాగిలు ప్రాంతంలోని అంజనాద్రి కొండలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి అనే వివాహిత.. తన ఇద్దరు చిన్నారులపై పెట్రోల్‌పోసి నిప్పంటించింది. స్థానికులు మంటలను గమనించి అక్కడకు చేరుకునే లేపే.. ఓ చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు గాయపడిన చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
దొంగతనం నెపంతో.. ఐదో తరగతి విద్యార్థినిపై దారుణం..
మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక దొంగతనం చేసిందనే నెపంతో హాస్టల్ సూపరింటెండెంట్.. ఘోరంగా అవమాన పరిచింది. మిగిలిన విద్యార్ధుల ముందు ఆ బాలిక మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించింది. బేతుల్ జిల్లాలోని దమ్జీపురా ప్రాంతంలోని గిరిజన బాలికల హాస్టల్లో గతవారం జరిగిందీ ఘటన. బాలిక తండ్రి.. తన కుమార్తెను చూడడానికి హాస్టల్‌కు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఐదో తరగతి చదువుతున్న బాలిక దెయ్యంలా కనిపించడానికి ముఖానికి పౌడర్ పూసుకుని.. మరో బాలికకు చెందిన రూ.400 దొంగతనం చేసిందని హాస్టల్ సూపరింటెండెంట్ ఆరోపించింది. దీంతో తనకు ఈ రకమైన శిక్ష విధించినట్లు బాలిక తన తండ్రి వద్ద వాపోయింది. ఆ హాస్టల్లో ఉండలేనని చెప్పింది. మంగళవారం బాలిక తండ్రి దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పాజైన్ హాస్టల్ సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తప్పించారు.