పట్టపగలే ఓ యువకుడిని కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన బిహార్‌లోని సహస్ర జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... అమిత్ కుమార్ అనే 18 ఏళ్ల యువకుడు గంహరియాలోని వార్డు నెంబర్ 12లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం బీఏ చదువుతున్నాడు. కాగా, అతడి ఫ్రెండ్ గౌరవ్.. మార్కెట్‌కు వెళ్దామని ఫోన్ చేశాడు. దీంతో స్నేహితుడు చెప్పినట్లుగా మార్కెట్‌కు నడుచుకుంటూ వెళ్తున్న అమిత్‌ను.. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇద్దరు నిందితులతో పాటు అమిత్ ఫ్రెండ్ గౌరవ్ మీద కూడా మృతుడి తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
బిహార్‌లో నేపాల్ పౌరుడు మృతి..
బిహార్‌లో దారుణం జరిగింది. ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం అయిన జోగ్‌బానిలోని వార్డ్ నెంబర్ 3లో నేపాల్‌కు చెందిన యువకుడి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇరు దేశాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన అరియానా జిల్లాలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే.. సోమవారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని చూశారు. అనంతరం జోగ్బాని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడి వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై భారత్, నేపాల్‌కు చెందిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు వివరాలు తెలుసుకోవడానికి నేపాలీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పోలీసుల అనుమానాలు..
ఇండో నేపాల్ బార్డర్ ప్రాంతమైన ఇంద్రానగర్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా అధికంగా ఉంటుంది. దీంతో డ్రగ్స్ సేవించడానికి నేపాల్ ప్రజలు ప్రతిరోజు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ ఘటన జరగడానికి ముందు కూడా.. ఈ ప్రాంతంలో చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో దొంగతనంలో భాగంగానే ఆ యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.