బిహార్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ యువకుడు తన ప్రేయసిని సజీవదహనం చేశాడు. గర్భవతి అయిన ఆమె తన ప్రియడిని పెళ్లి చేసుకోమని కోరినందుకు.. నిందితుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడి కుటుంబసభ్యులు బాలిక తల్లిదండ్రులను నాలుగు రోజుల పాటు బంధించారు. వారి నుంచి తప్పించుకున్న మృతురాలి తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవాదా జిల్లాలోని రాజౌలీ ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీంతో వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. ఇదే సమయంలో వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. కుమార్తెలో కలిగిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు.. ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో వారు తమ కుమార్తె గర్భం దాల్చడానికి కారణమైన యువకుడి ఇంటికి వెళ్లారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోమని ఆ యువకుడ్ని కోరారు. అయితే దానికి ఆ యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా నిరాకరించారు. దీంతో ఆ బాలిక తన ప్రియుడిని పెళ్లి చేసుకోమని వేడుకుంది. అయినా సరే ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. కోపంలో ఉన్న యువకుడు.. తన ఇంట్లో ఉన్న ఆయిల్ తెచ్చి ప్రియురాలిపై పోసి నిప్పంటించాడు. దీంతో గర్భవతి అయిన బాలిక అక్కడికక్కడే సజీవదహనమైంది.
ఆ తర్వాత ఆ యువకుడు, అతడి కుటుంబసభ్యులు మృతి చెందిన బాలిక మృతదేహాన్ని హుటాహుటిన దహనం చేశారు. ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులను నిందితులు బెదిరించారు. అయితే, వారు బయటకు వెళ్లి ఎవరికైనా చెబితే సమస్య మరింత పెద్దది అవుతుందని భావించి వారు.. బాలిక తల్లిదండ్రులను వారి ఇంట్లోనే నిర్భందించారు. నాలుగు రోజుల తర్వాత నిందితులు బారి నుంచి తప్పించుకున్న మృతురాలి తల్లిదండ్రులు.. జరిగిన దారుణంపై పోలీసులకు లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై పూర్తి విచారణ జరిపి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి
చేతిలో గన్, కత్తిని పట్టుకుని బహిరంగంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం 6:40 గంటల సమయంలో ఓ వ్యక్తి తనని తాను గాయపరచుకుని.. కత్తి, తుపాకీ పట్టుకుని నాథూ కాలనీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపు స్థానికులు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు వారిపై దాడికి దిగాడు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి గాయపడ్డాడు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడగా పోలీసులు ఆ వ్యక్తి నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గొంతుపై కత్తితో కోసుకుని గాయాలతో ఉన్న అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడిని క్రిషన్ షేర్వాల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు తన భార్య నుంచి విడిపోయి.. తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు గుర్తించారు.