Youth Built Hydel Power Project in Idukki : జలవిద్యుత్ ప్రాజెక్ట్ అనగానే చాలా ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.. కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయగలవని అనుకుంటారు. కానీ, కేరళ ఇడుక్కికి చెందిన ఏడుగురు యువ ఇంజినీర్లు.. మాత్రం అలా అనుకోలేదు. తామే సొంతంగా ఓ జల విద్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ చేపట్టారు. చివరకు అనుకున్నది సాధించారు.
సొంతంగా జలవిద్యుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని భావించిన ఏడుగురు యువకులు.. 2014లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చిన్న తరహా జల విద్యుత్పత్తి విధానంలో భాగంగా 1 మెగావాట్ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌కు అనుమతులు అడిగారు. అయితే, 2018లో ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని చెబుతున్నారు యువ ఇంజినీర్ రాకేశ్ రాయ్.
"ఇది కేరళలోనే తొలి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ప్రాజెక్ట్. దీని కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి.. తన సొంతం స్థలంలోనే ప్రాజెక్ట్ నిర్మిస్తానంటూ ప్రభుత్వ అనుమతి కోరాలి. ఈ విషయాన్ని 2012లో తీసుకువచ్చిన చిన్న తరహ జలవిద్యుత్పత్తి విధానంలో పొందుపర్చారు. దీని ప్రకారం చిన్న ప్రైవేట్ జలవిద్యుత్ ప్రాజెక్టులను.. యజమాని సొంత స్థలంలోనే నిర్మించుకోవాల్సి ఉంటుంది."
--రాకేశ్ రాయ్, సీఎండీ
2018లో పనులు ప్రారంభించిన యువకులు.. ఇక్కడి నీటి లభ్యతను గమనించి ప్రాజెక్ట్‌ను 4 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించారు. రాకేశ్ రాయ్‌తో పాటు ఉన్ని శంకర్, నితీశ్, రెంజిని, సిరియాక్ జోస్, ఫారిస్, రిజో జోసెప్ అనే యువకులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకున్నారు.
"ఏడుగురు యువ ఇంజినీర్ల చొరవతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 4 మెగావాట్ల ఉత్పత్తికి ఈ ప్రాజెక్ట్ సరిపోతుంది. ముక్కుడం నుంచి వస్తున్న నీటిని వివిధ ప్రాంతాల్లో నిలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కరెంట్‌తోనే ప్రాజెక్ట్‌ను నడుపుతున్నారు."
--సంతోశ్ టీ అబ్రహం, ఈఈ కేఎస్ఈబీ
ఈ ప్రాజెక్ట్ కోసం చతురక్కల్లిప్పర వద్ద 10 మీటర్ల ఎత్తు, 29.4 మీటర్ల పొడవైన ఓ డ్యామ్‌ను కట్టారు. ఈ ప్రాజెక్ట్ వద్దకు నీటిని తరలించడానికి సుమారు 1.31 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్‌ను వేశారు. 1068 మీటర్ల దిగువన ఓ పవర్ హౌజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ విద్యుత్పత్తి అంచనా ఏడాదికి 1.1కోట్ల యూనిట్స్. కాగా.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.31 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం విద్యుత్‌ను విక్రయిస్తున్నారు.
చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ
రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్- ఇంటర్ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్ స్టోరీ అదుర్స్