గతేడాది వరదల వల్ల అసోం ప్రజలు ఇబ్బంది పడినా పట్టించుకోని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 22 ఏళ్ల యువతి(గ్రెటా థన్‌బర్గ్) ట్వీట్‌పై బాధపడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. అసోంలోని జోర్హట్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. టూల్‌కిట్ వ్యవహారంంలో కాంగ్రెస్ పాత్ర ఉందంటూ శనివారం అసోం పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నేను నిన్న ప్రధాని ప్రసంగం విన్నాను. అసోం అభివృద్ధి గురించో లేదా.. అసోంలో భాజపా చేసినదాని గురించో మాట్లాడతారని అనుకున్నాను. కానీ, టూల్‌కిట్ గురించి విచారం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 22 ఏళ్ల యువతి చేసిన ట్వీట్ గురించి ఆయన మాట్లాడటం విని నేను షాక్ అయ్యాను. భారత తేయాకు రంగాన్ని నాశనం చేయాలనుకునే వారికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అయితే.. అసోం ప్రజలు వరదల్లో మునిగిపోతున్నప్పుడు ప్రధాని ఎందుకు అసోంకు రాలేదు. భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ఎందుకు బాధపడలేదు? ఎప్పుడైనా.. తేయాకు కార్మికుల వద్దకు వెళ్లి, వారి సమస్యలను విన్నారా?"
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు
తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పిన మోదీ వ్యాఖ్యలను ప్రియాంక విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెబుతున్నా... అసోంలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. సమాజంలోని అన్నిరంగాల వారిని భాజపా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు.
ఇదీ చదవండి:'ఐదేళ్లలో చొరబాట్లు లేని రాష్ట్రంగా బంగాల్'