మూడు రోజుల క్రితం ఒడిశాలో ఓ వ్యక్తిని చంపి అనంతరం ముక్కలుగా నరికిన కేసులో మృతుడి తమ్ముడే నిందితుడని పోలీసులు నిర్ధరించారు. తల్లిదండ్రులను అన్న కొడుతున్నాడనే కారణంతోనే హత్యకు పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికినట్లు వెల్లడించాడు. నిందితుడు రింకును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలంగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రింకు, శంకర్ భవానీ మెహర్ అన్నదమ్ములు. తల్లిదండ్రులతో కలిసి సలేపల్లి ప్రాంతంలో వారిద్దరు నివాసం ఉంటున్నారు. మెహర్ తరుచుగా తల్లిదండ్రులను కొడుతుండేవాడు. కొద్ది రోజుల క్రితం కూడా తండ్రిని దారుణంగా కొట్టాడు మెహర్. దీంతో మెహర్ తండ్రి తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. మే 13న ఆస్తమా సమస్యతో మరోసారి ఆసుపత్రిలో చేరాడు మెహర్ తండ్రి. దీంతో తండ్రి వద్దే ఉన్న రింకు.. మరుసటి రోజు ఇంటికి వచ్చాడు.
అదే సమయంలో అన్నదమ్ములిద్దరికి మధ్య జరిగిన వాగ్వాదంలో.. రింకును కొట్టాడు మెహర్. దీంతో తీవ్ర కోపానికి గురైన రింకు.. అన్న మెహర్పై ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో మెహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మెహర్ మృతదేహాన్ని 8 ముక్కలుగా నరికాడు రింకు. వాటిని బయట పడేసేందుకు బ్యాగుల్లో కుక్కాడు. కానీ వాటిని బయటవేసేందుకు నిందితుడికి వీలుకాలేదు. దీంతో అన్న శరీర భాగాలను అక్కడే విడిచిపెట్టి.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు రింకు. మే 17న ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ జరిపి మృతుడి తమ్ముడే హత్యకు పాల్పడినట్లు నిర్ధరించుకుని అరెస్ట్ చేశారు.
ప్రియుడితో కలిసి సోదరుడి హత్య శవాన్ని ముక్కలుగా కోసి 8ఏళ్ల తర్వాత..
20 రోజుల క్రితం ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి సోదరుడిని అతి కిరాతకంగా హత్య చేసింది ఓ మహిళ. అనంతరం ఇద్దరు కలిసి.. శవాన్ని ముక్కలుగా కోసి వివిధ ప్రదేశాల్లో పడేశారు. కొద్ది రోజుల తర్వాత ఓ ప్రాంతంలో బాధితుడి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సరైన ఆధారాలు లేకపోవడం కారణంగా విచారణ అటకెక్కింది. బెంగళూరులో ఎనిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా నిందితులిద్దరూ పోలీసులకు చిక్కారు. ఇంతకీ ఆమె తన సోదరుడిని ఎందుకు చంపిందంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.