EV Scooter: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతుండటం వల్ల విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే పలు సంస్థలు ఈ-బైక్స్‌ను ప్రవేశపెట్టాయి. కానీ వీటి కొనుగోలు, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన ఈ-బైక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వాహన నిర్వహణకు తక్కువ ఖర్చు అవడమే అందుకు కారణం. ఈ బైక్ కేవలం రూ.15-20 ఖర్చుతో 50 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాదు ఈ వాహనానికి అత్యాధునిక సాంకేతికతను జోడించాడా యువకుడు.
పాలి జిల్లా టెవాలీ గ్రామానికి చెందిన 26 ఏళ్ల దినేశ్.. డీఫార్మసీ వరకు చదివాడు. బైక్స్ తయారు చేయాలన్న ఆసక్తితో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైనా పరిశోధన చేశాడు. ఆ తర్వాత ఓ పాత మోటార్ సైకిల్‌ను తీసుకుని అందులో తగిన మార్పులు చేసి ఈ-బైక్‌గా తయారు చేశాడు. ఇదంతా కేవలం మూడు నెలల్లో పూర్తి చేశాడు. ప్రమాదాలను నివారించేందుకు గేర్, స్పీడోమీటర్, బ్రేక్‌లకు సెన్సార్లను కూడా అమర్చాడు దినేశ్. ఈ బైక్ తయారు చేసేందుకు సుమారు రూ.50-60 వేలు ఖర్చు అయిందని తెలిపాడు.
"పాత బైక్‌లోని భాగాలని తొలగించి అందులో మోటర్ అమర్చడం, వైరింగ్ మొదలైనవి చేశాను. ఇందుకు నాలుగు బ్యాటరీలను వినియోగించాను. ఒక్కో బ్యాటరీ 12 వోల్ట్స్ ఉంటుంది. కంట్రోలర్ మొదలైనవి అమర్చి పూర్తి చేశాను. మొదట కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా తయారైంది."
--దినేశ్
ఈ బైక్ ప్రస్తుతం 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని.. ఇది మరింత వేగంగా నడిచేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు దినేశ్. అలాగే భవిష్యత్తులో ఈ బైక్‌కు ఛార్జింగ్ పెట్టనవసరం లేకుండా ఆటోమెటిక్ ఛార్జ్ ఆప్షన్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. దినేశ్ కృషిని అతని తండ్రి బాబులాల్ మాలవీయ ప్రోత్సహించారు. మరోవైపు, దినేశ్ బైక్ తయారీపై టెవాలీ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దినేశ్ కృషి చూసి తాము గర్వపడుతున్నామన్నారు అతనికి చదువు చెప్పిన టీచర్లు.
ఇదీ చూడండి : ఎనిమిది మంది పిల్లలు, భర్తను వదిలి.. 57 ఏళ్ల ప్రియుడితో...