Yogi Adityanath News: ఉత్తర్ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారాన్ని కట్టబెట్టి చారిత్రక విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో ఏడు దశల ఎన్నికలు ప్రశాంతంగా జరగడం గొప్ప విషయమన్నారు. ఆవేశంతో ఉన్నప్పుడు సంయమనం కోల్పోకూడదని, కరోనా సమయంలో పోరాటం చేసేటప్పుడు ప్రతిపక్షాలు తమపై కుట్ర చేశాయని ఆరోపించారు. అయినా ప్రజలు భాజపాకు చిరస్మరణీయ విజయాన్ని అందించి జాతీయవాదం, సుపరిపాలననే గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశాలపైనే పనిచేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. యూపీలో భాజపా ఘన విజయం అనంతరం ప్రజలను ఉద్దేశించి ఈమేరకు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యూపీ, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
UP Results 2022
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భాజపా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే యూపీలో ప్రజలు భాజపాను గెలిపించారన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధాని మోదీపై నమ్మకంతో మణిపుర్ ప్రజలు తమకు మళ్లీ అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. గోవాలో తమ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు చూసే దేవభూమి ఉత్తరాఖండ్లో ప్రజలు మోదీ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ ముఖ్యమంత్రులకు ట్విట్టర్ వేదికగా షా శుభాకాంక్షలు చెప్పారు.
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ల పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో భాజపా ఘన విజయం సాధించింది. ఉత్తర్ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఇదీ చదవండి: బుల్డోజర్లు, జేసీబీలతో భాజపా కార్యకర్తల సంబరాలు