కరోనా విపత్తు వేళ.. యోగా ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని తెలిపారు. కరోనా నుంచి పోరాడేందుకు యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం 7వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'(international yoga day) సందర్భంగా ఆయన ప్రసంగించారు.
"ఏడాదిన్నరగా కరోనాతో భారత్ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కాయి. ఈ విపత్తు వేళ ఆశా కిరణంగా యోగా మారింది. వైరస్‌పై పోరులో యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతర చైతన్యం పెంపొందుతుంది. యోగా కార్యక్రమాలను భారత్ మరింత ముందుకు తీసుకెళ్లింది. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
mYoga యాప్ ప్రారంభం..
కరోనా సంక్షోభంతో బహిరంగ కార్యక్రమాలు లేకుండా పోయాయని ప్రధాని మోదీ అన్నారు. అయినప్పటికీ.. యోగా పట్ల ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సహకారంతో భారత్ ఎమ్-యోగా అనే యాప్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. 'ఇందులో ప్రపంచంలోని వివిధ బాషల్లో యోగా శిక్షణకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. 'వన్ వరల్డ్- వన్ హెల్త్' సాధనకు ఇది ఉపయోగపడుతుంది. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాచీన శాస్త్రాల కలయికకు ఈ యాప్ ఒక ఉదాహణగా నిలువనుంది. ప్రస్తుతం ఎమ్-యోగా యాప్ ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో అందుబాటులో ఉంది. రానున్న నెలల్లో ఐరాస గుర్తించిన భాషల్లో దీన్ని తీసుకురానున్నాం.' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా యోగా సెంటర్లు
ఇదీ చూడండి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెబినార్