గల్లీ లీడర్లు, కార్పొరేటర్లు కూడా బయటకు వచ్చేప్పుడు నలుగురు అనుచరులను వెంటేసుకుని కనిపిస్తుంటారు. అలాంటిది దేశ, ప్రభుత్వాధినేతలకు ఇంకెంత భద్రత ఉంటుంది! చుట్టూ అంగరక్షకులు, మెటల్ డిటెక్టర్లు ఉన్నాసరే... దాడులు జరగవని, వారి ప్రాణాలకు ముప్పులేదని చెప్పలేం. అత్యంత సురక్షితమైన జపాన్‌లో మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురికావడమే ఇందుకు నిదర్శనం. గతంలోనూ ఎంతోమంది నేతలు దుండగుల కాల్పులకు బలయ్యారు. వారు ఏ హోదాలో, ఎప్పుడు, ఎలా చనిపోయారంటే...
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1984, అక్టోబరు 31న దిల్లీలోని నివాసం వెలుపల ఉండగా... భద్రతా సిబ్బందిలో సిక్కు మతానికి చెందిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ్టదారుణ ఘటనలో ఇందిర ప్రాణాలు కోల్పోయారు.

రాజీవ్‌గాంధీ
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్, మరికొందరు మృతిచెందారు.

జాన్ ఎఫ్ కెనెడీ
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హత్య ఇది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కెనెడీ... 1963, నవంబరు 22న భార్యతో కలిసి డాలస్ మీదుగా ఓపెన్ కారులో వెళ్తుండగా, లీ హార్వే ఒస్వాల్డ్ అనే వ్యక్తి ఆయనపై దారుణంగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన కెనెడీ అరగంట తర్వాత కన్నుమూశారు.

జియావుర్ రెహమాన్
బంగ్లాదేశ్ అధ్యక్షునిగా పనిచేసిన రెహమాన్ 1981, మే 30న చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఉండగా, సైనిక తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఆయనతో పాటు మరో 8 మంది చనిపోయారు.

అబ్రహం లింకన్
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న అబ్రహం లింకన్ 1865, ఏప్రిల్ 14న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్‌లో ప్రదర్శనను తిలకిస్తుండగా... జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి తలపై తుపాకీతో కాల్చాడు. గాయపడిన ఆయన మరుసటిరోజు ఉదయమే ప్రాణాలు విడిచారు.

లియాఖత్ అలీ ఖాన్
పాకిస్థాన్ తొలి ప్రధాని అయిన లియాఖత్ అలీ ఖాన్ 1951, అక్టోబరు 16న రావల్పిండిలోని ఈస్ట్ ఇండియా కంపెనీ గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలోనే అఫ్గానిస్థాన్‌కు చెందిన సయీద్ అక్బర్ రెండుసార్లు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అలీ ఖాన్ మరణించారు.

సాల్మన్ బండారు నాయకే
శ్రీలంక ప్రధాని బండారు నాయకే 1959, సెప్టెంబరు 25న కొలంబోలోని తన స్వగృహంలో ప్రజలతో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే బౌద్ధ పూజారి తాల్దువే సోమరామా థెరో.. బండారనాయకే ఛాతీ, పొత్తికడుపు, చేతిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ బండారనాయకే ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయారు.

పాట్రిస్ ఎమెరీ లుముంబా
లుముంబా నాడు కాంగో ప్రధాని. ఆ దేశం నుంచి వేరుపడిన రిపబ్లిక్ ఆఫ్ కటంగా అధికారులు లుముంబాను చిక్కించుకుని, బెల్జియం అధికారుల సమక్షంలో 1961, జనవరి 17న ఉరి తీశారు. ఈ ఘటన ఆ తర్వాత ఆఫ్రికా వ్యాప్త ఉద్యమానికి దారితీసింది.

షేక్ ముజిబుర్ రెహమాన్
పాకిస్థాన్ అనుకూల బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది... 1975, ఆగస్టు 15న తమ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంలోకి చొరబడి, ఆయనతో పాటు భార్య, అయిదుగురు పిల్లలను హతమార్చారు.

ఇట్జాక్ రాబిన్
ఇజ్రాయెల్ ప్రధానిగా.. పాలస్తీనాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబిన్ తీవ్రంగా కృషి చేశారు. ఓస్లో ఒప్పందానికి మద్దతుగా 1995, నవంబరు 4న టెల్ అవీవ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా... రాబిన్‌ను ఆల్ట్రానేషనలిస్ట్ యిగల్ అమీర్ కాల్చి చంపాడు.

బేనజీర్ భుట్టో
పాకిస్థాన్ ప్రధానిగా 2007, డిసెంబరు 27న భుట్టో రావల్పిండిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆమెతో పాటు మరో 23 మంది మరణించారు.

రణసింఘే ప్రేమదాస
శ్రీలంక అధ్యక్షుడి హోదాలో 1993, మే 1న కొలంబోలో మేడే పరేడ్‌ను ప్రేమదాస పర్యవేక్షిస్తుండగా... ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రేమదాస, మరో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

రఫీక్ హరిరి లెబనాన్
లెబనాన్ ప్రధాని హోదాలో హరిరి 2005, ఫిబ్రవరి 14న బీరూట్‌లో మోటారు వాహన ర్యాలీ నిర్వహిస్తుండగా... హెజ్బుల్లా ఉగ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. హరిరి, మరో 21 మంది చనిపోయారు.

ఇదీ చదవండి: