Kollur ORR Road Accident today : సంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాహ్య వలయ రహదారిపై కొల్లూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. బాహ్య వలయ రహదారిపై పటాన్ చెరు వైపు నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో హర్యానా నుంచి చిత్తూర్ వెళ్తున్న లారీ...... అదుపు తప్పి కిందకు దూసుకువచ్చింది. ఈ క్రమంలోనే రోడ్డుపక్కనున్న పూరిగుడిసెలపైకి దూసుకెళ్లింది.
Road Accident at Kollur ORR today : బాహ్య వలయ రహదారి పక్కన ఉండే మొక్కలకు నీళ్లు పోసేందుకు కర్ణాటకకు చెందిన కొందరు వచ్చి హెచ్‌ఎండీఏ కింద కాంట్రాక్టు కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా కొల్లూర్ జంక్షన్ సమీపంలో రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్డుకు మధ్యలో తాత్కలికంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. తెల్లవారుజామున ఓఆర్ఆర్ మీద అదుపు తప్పిన లారీ... ఓ గుడిసె మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న బాబు రాఠోడ్, కమలీబాయ్, బసప్ప రాఠోడ్ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కపక్కనే సుమారు పది గుడిసెలు ఉన్నాయి. లారీ మిగిలిన గుడిసెలను సైతం ఢీకొడితే మృతుల సంఖ్య మరింత పెరిగేది.
"మేమందరం హెచ్‌ఎండీఏ కింద కాంట్రాక్ట్ కూలీలుగా పని చేస్తున్నం. పొద్దున కాగానే లేచి రోడ్ల పక్కన ఉన్న చెట్లకు, డివైడర్ల మధ్య ఉన్న చెట్లకు నీళ్లు పోస్తాం. ఆ తర్వాత మా గుడిసెల్లోకి వచ్చేస్తం. మా గుడిసెలు కూడా రోడ్డు పక్కనే ఉన్నయి. రోజులాగే నిన్న పనులు ముగించుకుని గుడిసెలకు చేరినం. రాత్రి కాగానే పడుకున్నం. తెల్లవారి 4 గంటలకు ఇగ కాసేపైతే లేస్తం అనంగ.. దఢేల్‌మని శబ్ధం వచ్చింది. ఏమైందని చూస్తే మా పక్కనే ఉన్న గుడిసెలోకి లారీ దూసుకు వచ్చింది. మా గుడిసె కొంచెం దూరం ఉండటంతో మేం బతికి బట్టగట్టినం లేకపోతే మేం కూడా చచ్చిపోతుండే." అని స్థానిక కూలీలు తెలిపారు.
Lorry hits laborers at Kollur ORR : ఘటనా స్థలాన్ని మియాపూర్ ఏసీపీ నర్సింహారావు పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలం వద్ద శిథిలాలను తొలగించారు. సర్వీసు రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. సుమారు అర కిలోమీటర్‌కు పైగా దూరం రేలింగ్‌ను ధ్వంసం చేసుకుంటూ లారీ దూసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతి వేగం, నిద్ర మత్తే ప్రమాదానికి కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు
Sangareddy road accident today : బతుకుదెరువు కోసం వచ్చి.. రోజంతా కష్టపడి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, కుమారుడిని మృత్యువు కబళించటంతో వారి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు ఘటనాస్థలిలో మిన్నంటాయి.