International Women's Day 2022: ప్రమాదకరమైన అడవిలో ఒంటరి ప్రయాణం.. కొండలు ఎక్కిదిగుతూ, సెలయేళ్లు దాటుతూ 16 కిలోమీటర్ల నడక.. ఓ మహిళ దినచర్య ఇది. రోజూ ఇంతటి సాహసం చేయడం వెనుక పెద్ద సంకల్పమే ఉంది. అభివృద్ధికి, ఆధునిక సమాజానికి దూరంగా ఉండిపోయిన గిరిజన తండాలోని చిన్నారులకు విద్యాఫలాలు అందించాలన్న అభిలాషే.. ఆమెను ముళ్లబాటలో ముందుకు నడిపిస్తోంది.
అంబుమాల.. కేరళ కోజికోడ్ జిల్లాలోని ఓ గిరిజన తండా. 25 కుటుంబాలు, 80 మంది జనాభా ఉండే ఈ తండాలో ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ.. పాఠాలు చెప్పాలంటే మాత్రం ఉపాధ్యాయులు అడవిలో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఈ కష్టం భరించలేక గతంలో ఉన్న టీచర్ రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న 'మినీ'.. గిరిజన పిల్లలకు చదువు చెప్పేందుకు ముందుకు వచ్చారు. అధికారుల్ని అభ్యర్థించి మరీ.. అంబుమాల బడికి ఉపాధ్యాయురాలిగా తాత్కాలిక ప్రాతిపదికన 2015 ఆగస్టులో నియమితులయ్యారు.
Women's Day theme
మినీది.. చలియార్ పంచాయతీ పరిధిలోని వెండాతు పొయిల్. అంబుమాలకు, ఆమె ఇంటికి దూరం 8 కిలోమీటర్లు. రోడ్డు సదుపాయం ఏమీ ఉండదు. అడవిలో సాహస యాత్ర చేయాల్సిందే. అయినా ఏమాత్రం భయపడకుండా రోజూ విధులకు హాజరవుతున్నారు మినీ. అంబుమాలలో ఆరు నుంచి పదేళ్ల వయసున్న పది మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
"నేను ఇక్కడ చేరిన కొత్తలో విద్యార్థులు సరిగా మాట్లాడేవారు కాదు. నేను కూడా తమలో ఒకరని వారు అనుకునేందుకు ఆరు నెలలు పట్టింది. ఇప్పుడు వారు నాతో చనువుగా ఉంటున్నారు."
-మినీ టీచర్
విద్యా బోధనకే పరిమితం కాలేదు మినీ టీచర్. అంబుమాల వాసులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా మారారు. గిరిజనులకు సొంత ఇళ్లు, విద్యుత్ కనెక్షన్లు వచ్చేలా చూశారు. ఇందుకోసం ఓసారి అప్పటి ముఖ్యమంత్రి ఊమన్ చాందీని కలిసి అర్జీ ఇచ్చారు. గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జారీ, కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అండగా నిలుస్తున్నారు మినీ టీచర్. అంబుమాలకు రోడ్డు వేయించేందుకు ఇప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
Kerala Mini teacher
ఇలా రోజంతా పాఠాలు చెబుతూ, ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తారు మినీ టీచర్. సాయంత్రం విధులు ముగించుకుని మళ్లీ నడక ప్రారంభిస్తారు. సూర్యాస్తమయం తర్వాతే ఇంటికి చేరుకుంటారు.
"బడికి వస్తుండగా రెండు సార్లు ఏనుగులు వెంబడించాయి. పులులు, ఇతర వన్యమృగాల ముప్పు కూడా ఉంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాన పడితే మెరుపు వరదలు వస్తాయి. నేను ఇంటికి వెళ్లడం కుదరదు. గతంలో రెండుసార్లు వంతెన కొట్టుకుపోయింది. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. కానీ నేను క్రమం తప్పకుండాఇక్కడకు వస్తాను. ఇక్కడి పిల్లలంటే చాలా ఇష్టం. వారిని విడిచి ఉండడం కష్టం."
-మినీ టీచర్
International Women's Day
ఇంత చేస్తున్నా ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు మినీ టీచర్. మధ్యాహ్న భోజన పథకం నిధులూ సకాలంలో మంజూరు కాక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: అటు జైలు.. ఇటు శ్మశానం.. మధ్యలో సబర్మతి ఆశ్రమం