దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రైతులు 'కిసాన్ సంసద్'ను నిర్వహించారు. ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణా నుంచి దాదాపు 200 మంది మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. ఆందోళనలో మరణించిన రైతులను స్మరించుకుని రెండు నిమిషాల మౌనం పాటించారు.
"ఈ రోజు మహిళలు నిర్వహించిన కిసాన్ సంసద్ మహిళా శక్తికి నిదర్శనం. సాగుతో పాటు దేశాన్ని కూడా మహిళలు నడపగలరు. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రాజకీయ వేత్తలే. రైతుకు కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తున్నాం. రైతులను కేంద్రం ఉగ్రవాదులు, ఖలిస్థానీయులుగా పిలుస్తోంది. ఈ ఖలిస్థానీలు పండించిన ఆహారాన్ని ఎలా తింటున్నారు. రైతులను తప్పుదోవ పట్టించడం నిజంగా సిగ్గుచేటు. దేశాన్ని బతికిస్తున్నది ఈ రైతులే అన్నది గుర్తుంచుకోవాలి."
-సుభాషిని అలీ, రాజకీయ వేత్త
"నిత్యవసర వస్తువుల సవరణ చట్టం మహిళలకు, పేదలకు, మధ్యతరగతి వారికి పూర్తిగా విరుద్ధం. దేశంలో వంటనూనె, గ్యాస్ ధరలు ఈ చట్టం వల్లే విపరీతంగా పెరిగాయి. దీని వల్ల ఇంతకు ముందు చేసే చిన్న పొదుపును కూడా మహిళలు చేయలేకపోతున్నారు. బ్లాకు మార్కెటింగ్ యథేచ్ఛగా జరిగే అవకాశం ఉంది."
-నవ్ కిరణ్, మహిళా రైతు
కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చింది. వీటిపై రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. కనీస మద్దతు ధర తగ్గుదలతో సహా ప్రైవేటు కంపెనీల చేతిలో రైతులు బలవుతారని పలు అంశాలతో కేంద్రంతో చర్చలు జరిపాయి. చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాల చర్చలు ముగిసినా కొలిక్కి రాలేదు. చట్టాలతో రైతులకు మేలు చేకూరుతుందని కేంద్రం చెబుతోంది.
ఇవీ చదవండి: