Woman Stripped Beaten Up : మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువకముందే అలాంటి ఉదంతమే బంగాల్లో మరొకటి జరిగింది. పంచాయతీ పెద్దల సమక్షంలో ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడి చేశారు. మహిళా పంచాయతీ సభ్యురాలి ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం. బాధితురాలు నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. ఆమె భర్త దివ్యాంగుడు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
డార్జిలింగ్ జిల్లాలోని లోయర్ బాగ్దోగ్రా పరిధిలోని భుజిపాని గ్రామానికి చెందిన రోష్ని ఖేర్వార్ అనే మహిళకు ప్రదీప్ సర్కార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో గొడవ జరగడం వల్ల.. జులై 19న ఈ విషయంపై భుజిపానిలోని పంతబరి ప్రాథమిక పాఠశాలలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో ప్రదీప్ సర్కార్ భార్య గౌరీ సర్కార్.. రోష్ని ఖేర్వార్తో గొడవ పడింది. ఇరువర్గాలను విడదీసే ప్రయత్నంలో బాధిత మహిళ కూడా రోష్నీతో గొడవకు దిగింది. ఈ క్రమంలో రోష్నీ ఖేర్వార్.. బాధితురాలిపై కోపం పెంచుకుంది. బాధితురాలు గౌరీ సర్కార్ సన్నిహితురాలు. ఘటన జరిగిన మరుసటి రోజు మళ్లీ పంచాయతీ సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో రోష్నీ ఖేర్వార్, తన సన్నిహితులు కలిసి.. బాధితురాలిపై దాడి చేశారు. పంచాయతీ సభ్యుల ఎదుటే గిరిజన మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఈ సమయంలో పంచాయతీ పెద్దలు, గ్రామస్థులు ఉన్నా కూడా ఈ దారుణాన్ని ఎవరూ అడ్డుకోలేదు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బాగ్డోగ్రా పోలీస్ స్టేషన్లో నిందితులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బంగాల్లో జులై 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు.. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.