సొంత అన్ననే.. తనను అనేక ఏళ్లపాటు లైంగికంగా వేధించాడని 31 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఈ విషయం విన్న మహారాష్ట్ర అమరావతి జిల్లా పోలీసులు.. ఒక్కసారిగా నివ్వెరపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
మూడు దశాబ్దాలుగా మౌనంగా..
ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. బాధిత మహిళ ప్రస్తుత వయసు 44 ఏళ్లు. చిన్నప్పుడు ఆమె కుటుంబం అమరావతి జిల్లాలోని రాజ్పేఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది. అప్పుడే సొంత అన్న లైంగికంగా వేధించాడు. అలా 1983 నుంచి 1991 వరకు అనేక ఏళ్లపాటు కీచకపర్వం కొనసాగించాడు. అప్పుడే బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. కుటుంబం పరువు పోతోందని, మౌనంగా ఉండమని వారు సర్దిచెప్పారు. తర్వాత.. ఆమె తండ్రి మరణించారు. తల్లి ఆరోగ్యం క్షీణించింది. బాధితురాలికి మౌన వేదనే మిగిలింది.
ఆమెకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. కానీ.. చిన్నతనంలో అనుభవించిన నరకాన్ని ఆమె మర్చిపోలేకపోయింది. ప్రస్తుతం నొయిడాలో భర్త, కుమారుడితో కలిసి ఉంటున్న ఆమె.. ఇప్పటికైనా నోరు విప్పాల్సిందేనని నిర్ణయించుకుంది. ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో ఉంటున్న సోదరుడిపై.. అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, నొయిడా పోలీస్ స్టేషన్లోనూ కేసు పెట్టింది.
గర్భిణీపై రేప్.. అబార్షన్..
మరోవైపు.. గర్భిణీపై ముగ్గురు అత్యాచారం చేయగా.. ఆమెకు గర్భస్రావమైన ఘటన ఉత్తర్ప్రదేశ్ బరేలీలో జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. మూడు నెలల గర్భంతో ఉన్న మహిళ ఈనెల 13న బిషరత్గంజ్ ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో పొలంలో పనిచేస్తోంది. అప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆమెను రేప్ చేశారు. ఫలితంగా ఆమెకు అబార్షన్ జరిగింది. బాధితురాలి ఆరోగ్యం విషమించగా.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగిన రోజే ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి భర్త ఆరోపించాడు. తన భార్య ఆరోగ్యం విషమించాక జిల్లా ఆస్పత్రిలో చేర్చి.. అక్కడి నుంచి పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపితే.. మంగళవారం కేసు నమోదు చేశారని చెప్పాడు. అయితే.. ఈనెల 16నే బరేలీలోని మహిళా పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.