మహారాష్ట్ర నాసిక్‌లో అమానవీయ ఘటన జరిగింది. భర్త చావుపై అనుమానం వ్యక్తం చేసిన ఓ మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించారు భర్త కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. గాయాలపాలై పుట్టింటికి వెళ్లిన మహిళకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసింది. తాను అత్తింట్లో లేని సమయంలో భర్త ఎందుకు చనిపోయాడో తెలియక ఆమె అతడి చావుపై అనుమానం వ్యక్తం చేసింది. ప్రశ్నించిన మహిళను కొట్టడమే గాక ఆమె ముఖానికి మసి పూసి.. మెడలో చెప్పుల దండను వేసి ఊరేగించారు. జనవరి 30న జరిగిందీ ఘటన.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం..
శివ్రే గ్రామానికి చెందిన బాధితురాలికి కొద్దీ రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె భర్త.. బాధితురాలిని తన పుట్టింటి దగ్గర వదిలిపెట్టాడు. భార్యను చూసేందుకు పలుమార్లు అతడు తన పిల్లలతో అత్తవారింటికి వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా ఓ రోజు తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అత్తమామలు ఆమెతో చెప్పారు. ఒకవైపు గాయాలతో బాధపడుతున్న ఆమెకు తన భర్త చావు వార్త తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. తాను అత్తింట్లో లేని సమయంలో తన భర్త మృతి చెందడంపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆమె తన భర్త దశ దినకర్మ కార్యక్రమానికి అత్తవారింటికి వెళ్లింది. అప్పుడు తన భర్త సోదరిని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తురాలైన భర్త సోదరి.. తన వదినను కొట్టింది. అలాగే గ్రామస్థులు మరికొంతమంది బాధితురాలి ముఖానికి మసి పూసి.. మెడలో చెప్పుల దండను వేసి ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.