కేరళ ఎర్నాకులంలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిపడేశాడు ఓ భర్త. ఈ ఘటనపై కడవంత్ర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు మహారాష్ట్రకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. మృతురాలి భర్త రామ్ బహదూర్‌ను పోలీసులు నిందితుడిగా భావిస్తున్నారు. ఈ ఘటన అక్టోబరు 24న ఎర్నాకులంలోని గిరినగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్‌లో ఏడాదిగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఇంట్లో ఉంచాడు భర్త. వీరి ఇంటిలో నుంచి దుర్వాసన రావడం వల్ల యజమాని.. అక్టోబరు 24న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా.. మహిళ మృతదేహం కవర్‌లో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. భార్యను హత్య చేసి నిందితుడు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దెకు దిగినప్పుడు దంపతులు తమ గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు ఇవ్వలేదని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. ఇరువురి పేర్లు కూడా నిజమైనవో కాదోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: మరదలిపై పోలీసు అత్యాచారం.. ఐదుసార్లు అబార్షన్.. చివరకు ట్విస్ట్
ఇదేం తిక్కరా నాయనా.. లక్ష టపాసులతో కారును అలంకరించి.. మంట పెట్టి..