ప్రసవించిన నిమిషాల్లోనే నవజాత శిశువును టాయిలెట్‌లోని కిటికీ నుంచి బయటకు విసిరేసింది ఓ మహిళ. ఆస్పత్రి చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బంగాల్లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కస్బా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఏప్రిల్ 22వ తేదీన తన ఇంటి బాత్రూంలో ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ చిన్నారి ఏడవడం వల్ల.. కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు విసిరేసింది. అద్దాలు పగిలిన శబ్దం విన్న స్థానికులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నవజాత శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. తల్లీబిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆ మగబిడ్డ ఏప్రిల్ 23 ఉదయం మరణించాడు.
అయితే తాను గర్భవతి అని తనకు తెలియదని ఆ మహిళ.. పోలీసులకు తెలిపింది. బిడ్డ ఏడుపు విని కంగారుపడ్డానని, అందుకే బయటకు విసిరివేసినట్లు చెప్పింది. మహిళ కుటుంబసభ్యులు కూడా.. ఆమె గర్భవతి అని తెలియదని చెప్పారు. ఆ మహిళకు గతేడాది నవంబర్‌లో వివాహం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. మహిళకు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు గుర్తించారు.
వేడి నీటి బకెట్లో 15 నెలల బాలుడు పడేసి హత్య!
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ 15 నెలల కుమారుడిపై ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. వేడి నీళ్ల బకెట్లో బాలుడిని పడేశాడు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని చకన్ సమీపంలో షెట్పింపాల్ రావ్ గ్రామంలో ఏప్రిల్ 6న ఈ ఘటన జరిగింది. బాలుడి తల్లి ఇంట్లోలేని సమయంలో వేడి నీటి బకెట్లో పిల్లవాడిని నిందితుడు పడేశాడు. అక్కడే ఉన్న చిన్నారి పిన్ని.. పిల్లవాడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆ చిన్నారి.. ఏప్రిల్ 18న మరణించాడు.
ఈ విషయమై బాలుడి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడే ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయాడని కట్టుకథలు చెప్పాడు. అనంతరం చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టాలపై నిద్ర.. రైలు ఢీకొని ముగ్గురు మృతి
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాదకరమైన ఘటన జరిగింది. ట్రాక్‌పై నిద్రపోతున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు ముగ్గురూ మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ముత్తుప్పేట పక్కనే ఉన్న ఉప్పూరు ప్రసిద్ధ మారియమ్మన్ ఆలయ ఉత్సవాలు ఈ నెల 14న ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో పదో రోజైన సోమవారం దేవుడి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆ వేడుకకు హాజరైన ముగ్గురు యువకులు.. గుడి దగ్గర్లో ఉన్న రైల్వే ట్రాక్‌పై పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తాంబరం నుంచి సెంగోట్టై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఆ మార్గంలో వచ్చింది. ఒక్కసారిగా వీరి ముగ్గురిని ఢీకొట్టింది. రైలు ఢీకొని అరుల్ మురుగదాస్, మురగ పాండియన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు భరత్ కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర ప్రమాదం.. 24 మందికిపైగా..
ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయ్యి లారీ.. ఓ బస్సును ఢీకొట్టగా.. రెండు వాహనాలు లోయలో బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 24 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.
పోలీసుల సమచారం ప్రకారం.. జిల్లాలోని చుట్పాల్ లోయ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున.. రాంచీ నుంచి వస్తున్న ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు లోయలో బోల్తాపడ్డాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చిన్నారులు మిస్సింగ్ అంటూ ఆందోళన.. వాళ్లేమో చక్కగా కూలర్లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు! తీరా రంగంలోకి దిగి పోలీసులు వెతకగా చక్కగా వారిద్దరూ ఓ పాత కూలర్ లోపల నిద్రపోతూ కనిపించారు. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని ఇరాదత్నగర్కు చెందిన ఇద్దరు చిన్నారులు.. సోమవారం అర్ధరాత్రి తమ ఇళ్ల సమీపంలో ఆడుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఇద్దరూ కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. ఎక్కడా వారి ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. మూడు గంటల పాటు వెతికిన పోలీసులు.. చివరికు ఆ ప్రాంతంలో ఉన్న ఓ పాత కూలర్‌ను గుర్తించారు.
కూలర్‌పై మూత లేకపోవడం చూసిన పోలీసులు.. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లారు. టార్చ్‌లైట్ వేసి చుడగా ఇద్దరు చిన్నారులు అందులో నిద్రిస్తున్నారు. అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మూడు గంటల్లోనే చిన్నారులను సురక్షితంగా గుర్తించిన పోలీసులకు చిన్నారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.