Woman Beaten Up In Bengal : వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో మహిళ జుట్టును కత్తిరించి, వీధిలో దాడి చేసిన ఘటన బంగాల్లోని ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాలో జరిగింది. మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడి చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరందీఘీ బ్లాక్‌లో నివాసం ఉంటున్న బాధిత మహిళను.. గురువారం మధ్యాహ్నం కొందరు స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ దాడి చేశారు. అడ్డుగా వచ్చిన ఆమె భర్తను కట్టేశారు. మహిళ జుట్టును కత్తిరించి, వీధిలోకి ఈడ్చుకెళ్లారు. కొందరు స్థానికులు ఆమెను రక్షించి కరందీఘీ రూరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీలో చేర్పించారు.
అయితే తన ఇంట్లో ఉన్న బంగారు నగలను, డబ్బును కూడా స్థానికులు దోచుకెళ్లారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను రక్షించడానికి వచ్చిన భర్తను కట్టేశారని చెప్పింది. విచక్షణారహితంగా తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొంది. "నేను ఇంట్లోలేని సమయంలో స్థానికులు దాడి చేశారు. లోపలికి వచ్చి చూస్తే ఉన్నదంతా దోచుకున్నారు. నా కుమారుడు, కోడలిను కొట్టారు. ఆమె ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి. దాడి చేసిన నిందుతులను కఠినంగా శిక్షించాలి" అని బాధితురాలి మామ డిమాండ్ చేశారు.
దాడి వెనుక రాజకీయ కుట్ర..
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని స్థానికుడు గోపాల్ ఆరోపించారు. ఈ ఏడాది జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని తెలిపారు. ఈ కుటుంబం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల స్థానికులు దాడి చేసి ఉంటారని ఆరోపణలు చేశారు.
అయితే ఈ దాడిలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని పంచాయతీ సభ్యుడు దీపు సింగ్ తెలిపారు. మహిళపై దాడి చేయడం దారుణమని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని.. ఇప్పటికీ ఒకరిని అరెస్ట్ చేశామని జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ మీనా వెల్లడించారు.
Woman Paraded : గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. గ్రామమంతా ఊరేగించిన భర్త.. అత్తమామలు కూడా!