Woman burnt in Jharkhand: ఝార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో ఓ మహిళను చితకబాదారు. ఆమె బతికుండగానే శరీరానికి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Witch case in Jharkhand:
జరియో దేవి అనే మహిళ కుద్పానీ ప్రాంతంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె భర్తతో కలిసి ఫ్లోరెన్స్ డంగ్‌డంగ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన అంత్యక్రియలకు వెళ్లింది. దీపా టోలీలో ఉన్న ఇంటికి వెళ్లిన కొద్ది గంటల తర్వాత జరియో దేవిపై ఫ్లోరెన్స్ సహా మరో 10 మంది కలిసి దాడి చేశారు. ఆమె భర్తనూ కొట్టారు. చివరకు మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

Crime news Jharkhand
భార్య అరుపులు విని ఏమీ చేయలేక నిస్సహాయంగా రోధించాడు జరియో దేవి భర్త. చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు సహకరించారు. తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత మంటలను ఆర్పగలిగారు. అనంతరం జరియో దేవిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఫ్లోరెన్స్ డంగ్‌డంగ్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరియో, ఆమె భర్త.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఫ్లోరెన్స్ ఇంటికి వెళ్లారని పోలీసులు తెలిపారు. క్షుద్రపూజలు చేస్తోందన్న ఆరోపణలతోనే జరియోపై దాడి చేశారని చెప్పారు.
ప్రస్తుతం సిమ్డేగాలోని సదర్ ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతోంది. గాయాల తీవ్రత దృష్ట్యా ఆమెను రాంచీ రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: రూ.8కోట్లు ఖర్చు.. కరోనాపై 8 నెలల పోరాటం.. అయినా దక్కని రైతు ప్రాణం!