Wing Commander Prithvi: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన వింగ్ కమాండర్ పృథ్వీసింగ్ చౌహాన్ అంత్యక్రియలు జరిగాయి. ఆగ్రాలోని తాజ్‌గంజ్ శ్మశానవాటిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చౌహాన్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
చౌహాన్ చితికి ఆయన 12ఏళ్ల కుమార్తె ఆరాథ్య తన ఏడేళ్ల సోదరుడు అవిరాజ్‌తో కలిసి నిప్పంటించారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నారు ఆరాథ్య.
అంత్యక్రియల అనంతరం చౌహాన్ కూతురు ఆరాథ్య భావోద్వేగంగా మాట్లాడారు.
"నాన్నే నా హీరో. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా. నేనూ వాయుసేనలో చేరి పైలట్ కావాలనుకుంటున్నా" నని ఆరాథ్య అన్నారు.
మార్కుల కోసం కాదు.. చదువుపై దృష్టిపెట్టాలని తన తండ్రి ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చదువుపై దృష్టిపెడితే మార్కులు వాటింతట అవే వస్తాయని ఆయన నమ్మేవారని చెప్పుకొచ్చారు. పృథ్వీసింగ్ చౌహాన్ అంత్యక్రియల్లో వాయుసేన అధికారులతో పాటు ఆగ్రా ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పృథ్వీ సింగ్ చౌహాన్ 2000 సంవత్సరంలో వాయుసేనలో చేరారు. ఆయన కుటుంబం 2006లో ఆగ్రాలో స్థిరపడింది.
ఇదీ చూడండి: Cds Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్ దంపతుల అస్థికలు