పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన న్యాయమార్తి నాలుక కోస్తామంటూ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మణికందన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిండిగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మణికందన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పందించి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మణికందన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. అయితే న్యాయమూర్తిని బెదిరించినందుకు మణికందన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీకి 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో నిరసన ర్యాలీని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మణికందన్.. రాహుల్ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించారు. 'మేం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయమూర్తి నాలుక కోసేస్తాం' అని మణికందన్ అన్నారు. దీంతో న్యాయమూర్తిని బెదిరించినందుకు పలు సెక్షన్ల కింద మణికందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడేమీ కొత్త కాదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఆ పార్టీకి చెందిన వారు గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తీర్పులు వ్యతిరేకంగా వస్తే ఇలా బెదిరింపులకు దిగడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీ కాలానికి ముందే కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థపై దాడి చేసిందని.. ప్రస్తుతం తీవ్ర నిరాశతో దాడిని మరింత తీవ్రతరం చేసిందన్నారు కిరణ్ రిజుజు. ఆ పార్టీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని.. కానీ తమకు ఆ నమ్మకం ఉందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ నీతులు చెబుతున్నారు కానీ.. వాటిని ఆచరించడం లేదని ఆయన తీరుపై మండిపడ్డారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి.
మణికందన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. దిండిగల్ జిల్లా అధ్యక్షుడి బెదిరింపులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని పరిస్థితి ఎలా ఉందో తెలుపుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో దిగ్గజ నాయకులు ఉన్నప్పటి పరిస్థితి.. ప్రస్తుతం ఏమాత్రం లేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్రూరమైన, అబద్దాలు చెప్పే వ్యక్తులతో పూర్తిగా నిండిపోయిందని మండిపడ్డారు. సిగ్గులేని నాయుకుడు ఉన్న ఆ పార్టీ భారత ప్రజాస్వామ్యంలో విదేశీ శక్తుల జోక్యాన్ని కోరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.