పోలింగ్ తేదీ సమీపిస్తున్నా.. తమిళ ఓటర్ల అంతరంగం మాత్రం బయటపడటంలేదు. అన్నాడీఎంకే, డీఎంకే పోటీ పడి హామీలిచ్చి ఉద్ధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నా.. ఓటర్ల నాడి పట్టుకోవడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. అన్నాడీఎంకే పదేళ్ల పాలనను కొనసాగించాలా? డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం అయ్యేందుకు ఓ సారి అవకాశాన్ని కల్పించాలా? అన్న దానిపై మీమాంసలో ఉన్నారు.
హ్యాట్రిక్ కొడితే చరిత్రే!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఎంజీఆర్ తర్వాత ఏ పార్టీకి హ్యాట్రిక్ అవకాశం ఇవ్వని తమిళ ఓటర్లు.. ఈ సారి ఆ సంప్రదాయాన్నే పాటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా.. నువ్వా-నేనా అన్న రీతిలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి పనితీరుపై తటస్థ ఓటర్లలో అసంతృప్తి అంతగా కనిపించడంలేదు. హ్యాట్రిక్ సాధిస్తామన్న ధీమా అన్నాడీఎంకే వర్గాల్లో కనిపిస్తోంది. పెద్దఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నందున తమ కూటమికే విజయావకాశాలు ఉంటాయని.. అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. అటు, అన్నాడీఎంకే హ్యాట్రిక్ ప్రయత్నాలను అడ్డుకొని ఓటర్ల మన్నన పొందాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. ఎన్నికల ఫలితాలు.. డీఎంకే కూటమికే సానుకూలంగా ఉంటాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. 39కు 38 స్థానాలను డీఎంకే దక్కించుకుంది. శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగిస్తామన్న ధీమా, డీఎంకే నేతల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి:- అప్పుడు జయ, కరుణ.. మరి ఇప్పుడు?
రాష్ట్రంలో అధికారం ఇలా..
తమిళనాడు శాసనసభకు జరిగిన తొలి మూడు ఎన్నికల్లో.. కాంగ్రెస్ వరుసగా గెలిచింది. రాజగోపాలాచారి నేతృత్వంలో ఒకసారి, కామరాజర్ నేతృత్వంలో రెండుసార్లు ప్రభుత్వం ఏర్పడింది. 1967, 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే వరుసగా గెలవగా.. అన్నాదురై, కరుణానిధి నేతృత్వంలో.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1977, 1980, 1984 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు అన్నాడీఎంకే గెలవగా.. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణానంతరం ఇప్పటివరకు ఏ పార్టీ కూడా.. వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేదు.
తమిళ ఓటర్లకు.. 1989 నుంచి ఒక ఎన్నికల్లో ఓ పార్టీకి.. మరో ఎన్నికల్లో ఇంకో పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. 2016 ఎన్నికల్లో మాత్రం తమిళ ఓటర్లు ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు. 2011, 2016లో అన్నాడీఎంకేకు అధికారం కట్టబెట్టారు. దీంతో.. 3 దశాబ్దాల అనంతరం వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఘనత.. మాజీ సీఎం జయలలితకు మాత్రమే దక్కింది. సంక్షేమ పథకాలు అమలు వల్ల జయలలితకు రెండోదఫా తమిళ ఓటర్లు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయకేతాన్ని ఎగరవేసి హ్యాట్రిక్ సాధించి ఎంజీఆర్ రికార్డు సమం చేయాలని పళనిస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇదీ చూడండి:- తమిళ పోరు: ఈ ఆరుగురిపైనే అందరి దృష్టి
మరోవైపు ఈ ఎన్నికల్లో గెలవకుంటే.. పార్టీ భవిష్యత్తు, తన వ్యక్తిగత ప్రతిష్ఠ మసకబారుతాయన్న ఆందోళనతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
హామీల వర్షం...
అధికార అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో.. ఉచిత వాషింగ్ మెషిన్, కేబుల్ కనెక్షన్, రేషన్‌కార్డుదారులకు ఏడాదికి 6 సిలిండర్లు వంటి అనేక హామీలిచ్చింది. ఈ హామీల పట్ల పలువురు తమిళ ఓటర్లు ఆకర్షితులవుతున్నారు.
అన్నాడీఎంకే పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్నందున, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సీఎం అయ్యేందుకు.. ఎందుకు అవకాశం ఇవ్వకూడదని కూడా పలువురు భావిస్తున్నారు. డీఎంకే కరోనా బాధిత కుటుంబాలకు 4వేల రూపాయల నగదు, నీట్ రద్దు వంటి 501 హామీలు ఇచ్చింది. ఇవీ ఓటర్లను ప్రభావం చేస్తున్నాయి.
మరి వీరిలో గెలుపెవరిది? ప్రజలు ఎవరివైపు? అనేది మే 2నే తేలుతుంది.
ఇదీ చూడండి:- సొంత పార్టీకి ఓటేయొద్దని అగ్రనేతల ప్రచారం!