హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 68 స్థానాలకుగానూ 40 స్థానాల్లో గెలిచింది. భాజపా 25 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. దీంతో హిమాచల్‌కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఎవరు రాష్ట్ర పగ్గాలు చేపట్టునున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. అయితే ముఖ్యంగా ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. వారిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించడం వల్ల ఆ పార్టీ నాయకులు, శ్రేణులకు బూస్ట్‌ను ఇచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గెలిచిన ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. హిమాచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఏఐసీసీ పరిశీలకులు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాను సిమ్లాకు పంపించింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చండీగఢ్‌కు తరలించనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. అక్కడే శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ అధిష్ఠానం ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బఘేల్, సీనియర్ భూపిందర్ సింగ్ హుడాను పరిశీలకులుగా హిమాచల్‌కు పంపుతోంది. ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులను ఛండీగఢ్‌కు తరలిస్తాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన 10 హామీలను నెరవేరుస్తాం. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు.. ప్రజల విజయం. '
--రాజీవ్ శుక్లా, హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జ్
జైరాం ఠాకూర్ రాజీనామా..
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. 'ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. నాకు గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటాం.' అని జైరాం ఠాకూర్ తెలిపారు.