అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దానిని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ.. విపక్షాలు, మహిళ సంఘాల నేతలతో పాటు సొంత పార్టీలోని మహిళా నేతలు సైతం ఆయన్ను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
కేఆర్ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా విమర్శించారు.
"అత్యాచారం అనివార్యమైతే.. ఆనందించాలి అని విధానసభలో ఓ కాంగ్రెస్ నేత మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళా సాధికారత గురించి మాట్లాడే ముందు.. కాంగ్రెస్ తమ నేతను సస్పెండ్ చేయాలి. ఆ తర్వాతే యూపీలో 'లడ్కీ హూన్, లడ్ శక్తి హూ(నేను అమ్మాయిని, పోరాడగలను)' వంటి నినాదాలు చేయాలి"
- స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి.
దేశంలో ఇప్పటికీ మహిళా ద్వేషపూరిత ప్రజా ప్రతినిధులు ఉండటం దురదృష్టకరం అని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు.
రమేశ్ వ్యాఖ్యలను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా ఖండించారు.
"అవమానకరమైన ప్రవర్తన, అసహస్యకరమైన చర్య. అటువంటి వారితో పార్టీ మాట్లాడాలి. కఠినమైన చర్యలు తీసుకోవాలి. తద్వారా ఇతరులు అలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండటానికి దోహదపడుతుంది. దాని గురించి సభలో ప్రస్తావించడం మరచిపోవాలి. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు అసెంబ్లీలో లేదా పార్లమెంటులో కూర్చుంటే, పరిస్థితి ఎలా మారుతుంది? ఎవ్వరూ ఇలా మాట్లాడే సాహసం చేయని విధంగా వారికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా మనం ఒక ఉదాహరణను సృష్టించాలి."
- జయా బచ్చన్, సమాజ్వాజ్పార్టీ ఎంపీ
రమేశ్ అలా అని ఉండకూడదని, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడి పేర్కొన్నారు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే. రెండు సార్లు స్పీకర్‌గా చేశారని గుర్తు చేశారు. ఈ విషయంపై ఆయన క్షమాపణలు చెప్పినందున మరింత సాగదీయొద్దని సూచించారు.
గవర్నర్‌కు ఫిర్యాదు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్‌పై దిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రమేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, కర్ణాటక అసెంబ్లీలో సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
ఏం జరిగింది?
కర్ణాటక అసెంబ్లీ వేదికగా.. అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దానిని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కేఆర్ రమేశ్ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం చెలరేగింది. అయితే ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు రమేశ్. ముందు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన.. చట్టసభ వేదికగానూ క్షమాపణలు కోరారు.
"నా ఉద్దేశం సభ ప్రతిష్ఠను దిగజార్చడం కాదు. ఆ విధంగా ప్రవర్తించినందుకు నన్ను నేను సమర్థించుకోలేను. దేశంలోని ఏ ప్రాంత ప్రజలనైనా బాధపెట్టి ఉంటే, సభా కార్యకలాపాల సమయంలో నేను మాట్లాడినందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను" అని అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభంలోనే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'అత్యాచారం అనివార్యమైతే.. ఆనందంగా ఆస్వాదించండి!'