ఉద్యమం నుంచి అవతరించి అసోం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిన 'అసోం గణ పరిషత్ (ఏజీపీ)' తాజా ఎన్నికల్లో అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. రాష్ట్రంపై క్రమంగా కోల్పోతున్న పట్టును.. తిరిగి చేజిక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి ఏజీపీ లక్ష్యం నెరవేరుతుందా? రాష్ట్రంలో ఆ పార్టీ పునర్ వైభవాన్ని సాధిస్తుందా?
అవతరణ..
అసోంలోకి విదేశీయుల వలసలను నిరసిస్తూ ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఆరేళ్లపాటు పెద్దయెత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ ఉద్యమ ఫలితంగా 1985లో ఏజీపీ అవతరించింది. దాని స్థాపకుడు ప్రఫుల్లకుమార్ మహంత, ఎన్నికల గుర్తు ఏనుగు. రాష్ట్రంలో ఒకప్పుడు అదికారాన్ని సైతం దక్కించుకొని ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఆ పార్టీ.. కొన్నేళ్లుగా సరైన ఫలితాలు దక్కక ఇబ్బంది పడుతోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఇప్పుడు ఏజీపీ ఎన్నికల బరిలో దిగింది. ఒకప్పుడు అసోంలో ఏజీపీకి భాజపా జూనియర్ భాగస్వామి. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. పొత్తులో భాగంగా ప్రస్తుతం కేవలం 23 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో విజయం సాధించాలన్నా ఏజీపీ తీవ్రంగా చెమటోడ్చక తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకు ప్రధాన కారణాలివీ..
5 సిట్టింగ్ స్థానాలు గల్లంతు
పంపకాల్లో భాగంగా ఐదు సిట్టింగ్ స్థానాలను భాజపాకు ఏజీపీ కేటాయించాల్సి వచ్చింది. అవి.. బర్హంపుర్, కమలాపూర్, లఖీంపూర్, నాహర్ కటియా, పతచర్కుచీ, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైన సరూపాథర్ సీటునూ కమలదళానికే ప్రస్తుతం సమర్పించుకోవాల్సి వచ్చింది. పార్టీకి మంచి పట్టున్న ఈ స్థానాలను కోల్పోవడం ప్రతికూల పరిణామం. బర్హంపుర్లో 1991 నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత ఆరుసార్లు గెల్చుకోవడం గమనార్హం.
ఆ రెండు పార్టీలు
ఏజీపీకి విజయావకాశాలు కాస్త మెరుగ్గా ఉన్న స్థానాలు బొంగయిగావ్, గువాహటి పశ్చిమ, తేజ్‌పుర్, కాలియబోర్, బొకాఖత్, చబువా, అమ్గురి, టేక్, డెరగావ్. అయితే- పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై పోరాటంలో భాగంగా అవతరించిన అసోం జాతీయ పరిషద్, దాని మిత్రపక్షం రైజోర్ దళ్ నుంచి ఈ సీట్లలోనూ ఏజీపీకి గట్టి పోటీ ఎదురవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఇన్ని ప్రతికూలతలను దాటుకొని అసోంలో ఏజీపీ ఒకప్పటి వైభవాన్ని తిరిగి పొందే దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే!
కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్ మైత్రితో కష్టమే
ప్రస్తుతం ఏజీపి బరిలో నిలిచిన పలు స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా జోత్ కూటమి బలంగా ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ ఇప్పుడు చేతులు కలపడం ఏజీపీకి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో ఆల్గా పుర్, అభయపురి ఉత్తర, ఆదయపురి దక్షిణ, బర్ పేట్, సారుఖేత్రి, బోకో, చయ్ గావ్, దల్ గావ్, జమునాముఖ్ స్టానాల్లో ఏజీపీ అభ్యర్థులు పోటీ చేశారు. అవి ఇప్పుడూ ఆ పార్టీకే దక్కాయి. అయితే- వీటిలో ఒక్క చయగావ్ మినహా అన్ని స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఏఐ యూడీఎఫ్‌లకు దక్కిన ఉమ్మడి ఓట్లు 58 పైమాటే. కాబట్టి ఈ దఫా వాటిలో మహాజోత్ విజయం లాంఛనమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏజీపీ పోటీ చేస్తున్న మన్కచర్, సెంగా, భవానీపుర్ కరీమ్గంజ్ దక్షిణ, రాహా, గోల్పారా తూర్పు, గోల్పారా పశ్చిమ, నవోబైచా స్థానాలూ ముస్లిం ప్రాబల్య ప్రాంతాలే. వాటిలోనూ మహా జోత్ కూటమికే విజయావలకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- అసోంలో కాంగ్రెస్‌కు రెడ్ కార్డ్: మోదీ