కేరళ మలప్పురం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News).. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయుల మధ్య సంబంధాలను ప్రధాని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ బంధాలను నిర్మించడమే తన కర్తవ్యమని.. అందుకు కట్టుబడి ఉంటానని అన్నారు. 'సావర్కర్ వంటి వారి దృష్టిలో భారత్ అంటే ఓ భూభాగమేనని.. పెన్నుతో చిత్రపటం గీసి.. ఇదే భారత్ అని చెబుతారని' రాహుల్(Rahul Gandhi News) వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రజలు లేకుంటే దానిని భారత్ అని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. మలప్పురంలో ఆయన ఓ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
"వారు భారత్ అంటే.. భూభాగం అని చెబుతారు. కానీ భారత్ అంటే ప్రజలు, వారి మధ్య సంబంధాలు అని మేం చెబుతాం. హిందూ, ముస్లిం, సిక్కుల మధ్య.. తమిళం, హిందీ, ఉర్దూ, బెంగాలీ మధ్య ఉన్న సంబంధాలు అవి. అయితే ఈ బంధాలను ప్రధాని నాశనం చేస్తున్నారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
'భారతీయుల మధ్య సంబంధాలను నాశనం చేయడానికి ప్రధాని ప్రయత్నిస్తే.. అది వారి ఆలోచనలను దెబ్బతీసినట్లే. అందుకే నేను ఆయన్ని వ్యతిరేకిస్తున్నాను. భారత ప్రజల మధ్య వారధిని నిర్మించడమే నా కర్తవ్యం.. అందుకు కట్టుబడి ఉంటాను. ద్వేషంతో ఆ వారధిని విచ్ఛిన్నం చేయడానికి మోదీ ప్రయత్నించిన ప్రతిసారీ.. ప్రేమతో ఆ వంతెనను పునర్నిర్మించడమే నా కర్తవ్యం. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. దేశంలో విభిన్న సంప్రదాయాలు, ఆలోచనలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోకుండా తాను ఈ వంతెనను నిర్మించలేను' అని రాహుల్ గాంధీ(Rahul Gandhi News) పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Sidhu news: 'వ్యక్తిగతంగా ఎవరిపైనా వైరం లేదు.. ప్రజల కోసమే'