Chandrayaan 3 Launch : చంద్రయాన్-3ని విజయవంతగా అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇస్రో ముందు మరో ప్రధాన సవాలు ఉంది. అదే ల్యాండింగ్. చంద్రయాన్-2లో ల్యాండర్, రోవర్‌ను జాబిల్లిపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడంలో ఇస్రో విఫలమైంది. ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రయాన్-3లో విజయవంతం అవ్వాలని ఇస్రో కోరుకుంటోంది. భూమి మీద ఒక రోజు అంటే పగలు, రాత్రి కలిపి 24 గంటలు ఉంటుంది. కానీ చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులకు సమానం. చంద్రునిపై పగలు ఆగస్టు 23 లేదా 24వ మొదలు అవుతుంది. ఆ సమయంలోనే జాబిల్లిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో భావిస్తోంది. ఆ 14 రోజులు అక్కడ సూర్యకాంతి లభిస్తుందని.. అప్పుడు మాత్రమే ల్యాండర్, రోవర్‌కు కావాల్సిన సౌరశక్తి అందుతుందని ఇస్రో వివరించింది. ఇస్రో చేపట్టాల్సిన విలువైన ప్రయోగాన్ని ఆ సమయంలోనే విజయవంతంగా చేసే వీలుంటుందని పేర్కొంది.
Chandrayaan 3 Landing Process : చంద్రుడిపై ల్యాండర్ సూర్యరశ్మి ఉన్న మరో రోజు అంటే మొదటి రోజు కాకుండా రెండో రోజు దిగితే ఏమవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు. ఒకవేళ చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్న రెండో రోజు రోవర్ దిగితే.. కేవలం 13 రోజులు మాత్రమే ప్రయోగం చేసే వీలు ఉంటుంది. 615కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రయోగంలో ప్రతి క్షణం విలువైనదేనని ఇస్రో భావిస్తోంది. అందుకే ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ల్యాండింగ్ కుదరకపోతే.. మళ్లీ చంద్రుడి మీద పగలు మొదలయ్యే వరకు అంటే సెప్టెంబర్ 23 వరకు ఆగాల్సి ఉంటుందని ఇస్రో స్పష్టం చేసింది.
చంద్రయాన్-2లో జరిగిన తప్పుల ఆధారంగా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్- 3 ల్యాండర్ మరింత దృఢమైందని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్ పాండియన్ అన్నారు. ఈ సారి లాంఛర్‌లో రెండు సెన్సార్లు ఉన్నట్లు చెప్పారు.
"ఒక సెన్సార్‌కు బదులుగా, రెండు సెన్సార్‌లు లాంఛర్‌లో ఉంటాయి. ఒక సెన్సార్ పనిచేయకపోతే రెండో సెన్సార్‌ను ఉపయోగించే వీలుంటుంది. విస్తృత వ్యాప్తిని నిర్వహించగల అనేక సాధనాలు, సాఫ్ట్‌వేర్‌లను అందులో పొందుపరిచాము. దీని వల్ల నిర్వహణ సులువుగా ఉంటుంది."
--పాండియన్, ఎస్‌డీఎస్‌సీ మాజీ డైరెక్టర్
చంద్రుడిపై చీకటి ఉన్న సమయంలో లాంఛింగ్ జరిగితే అక్కడ పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి విద్యుత్ అందదు. వాటిపై అమర్చిన సౌర ఫలకాల నుంచి మాత్రమే ల్యాండర్, రోవర్ విద్యుత్‌ను పొందగలుగుతాయి. ల్యాండర్ దిగే సమయానికి జాబిల్లిపై సూర్యరశ్మి ఉండాలి. అలా జరకపోతే పరిశోధనకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్, రోవర్ల జీవిత కాలం గరిష్టంగా 14 రోజులే అని ఇస్రో ఇంతకుముందే పేర్కొంది.