నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. కారు ఎక్కుతుండగా నలుగురు, ఐదుగురు వ్యక్తులు తనను నెట్టివేశారని దీదీ ఆరోపించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది తన వద్ద లేరని తెలిపారు. కాలికి అయిన వాపును ఆమె మీడియా సిబ్బందికి చూపించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. వాహనం ముందు సీట్లో కూర్చున్న మమతను భద్రతా సిబ్బంది ఎత్తుకుని కారు వెనుక సీట్‌లో కూర్చోబెట్టారు. నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ షెడ్యూల్ ప్రకారం అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే గాయపడినందున ఆమెను కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు.
గవర్నర్ పరామర్శ..
కాలినొప్పితో మమత కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న దీదీని బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరామర్శించారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'వివరణ ఇవ్వండి'....
మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనపై ఎన్నికల సంఘం స్పందించింది. ఘటన జరిగే సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ పక్కన లేకుండా పోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మమతది పోలిటికల్ డ్రామా..
గాయం కారణంగా మమత ఆసుపత్రిలో చేరడంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల సానుభూతి పొందటానికి దీదీ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని బంగాల్ పీసీసీ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపింంచారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం..
మమతా బెనర్జీపై జరిగిన దాడిని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులైనవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!