యాస్ తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన ఒడిశా, బంగాల్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా బంగాల్లో సమీక్షా సమావేశం నిర్వహించగా.. ఈ భేటీకి ముందు హైడ్రామా నెలకొంది. ముందుగా నిర్ణయించిన సమయానికి రాకుండా మోదీని వెయిట్ చేయించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ తర్వాత వచ్చినా.. నష్టంపై నివేదిక సమర్పించి 15 నిమిషాల్లోనే వెళ్లిపోయినట్లు సమాచారం. దీనిపై వివాదం చెలరేగింది. కావాలనే ఆలస్యంగా వచ్చారని భాజపా ఆరోపించగా.. అక్కడి అధికారుల సూచన మేరకే ఆలస్యంగా వెళ్లినట్లు తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.
ఇదీ జరిగింది..
బంగాల్ పశ్చిమ మేదినిపుర్ జిల్లా కలైకుండాలో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. అయితే.. సమావేశం ప్రారంభమైనప్పటికీ అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వచ్చారు దీదీ. సీఎం మమతా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమారు 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే.. తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను మోదీకి అందించి.. ఆ వెంటనే వెళ్లిపోయినట్లు పేర్కొన్నాయి.
భాజపా ఆరోపణలు..
ప్రధాని మోదీ సమావేశానికి హాజరుకాకపోవటంపై మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అది రాజ్యాంగ విలువలు, సహకార సమాఖ్యవాద సంస్కృతిని హత్య చేయటమేనన్నారు. సహకార సమాఖ్యావాదాన్ని మోదీ ఎంతో నిష్ఠతో పాటిస్తున్నారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులతో పని చేస్తున్నట్లు చెప్పారు. దీదీ వ్యూహాలు, రాజకీయాలు మరోమారు బంగాల్ ప్రజలను వెంటాడుతున్నాయని ఆరోపించారు. యాస్ తుపాను నేపథ్యంలో బంగాల్ ప్రజల కోసం మోదీ నిలబడ్డారని, మమత కూడా తన ఈగోను పక్కనపెట్టాలని సూచించారు.
తిప్పికొట్టిన టీఎంసీ..
అధికారుల సూచన మేరకే మమతా బెనర్జీ సమావేశానికి ఆలస్యంగా వెళ్లినట్లు చెప్పాయి దీదీ సన్నిహిత వర్గాలు. 'షెడ్యూలు కన్నా 20 నిమిషాలు ఆలస్యంగా రావాలని మమతను కోరారు. మరో 15 నిమిషాల పాటు ఆమె ఛాపర్ చక్కర్లు కొట్టింది. అక్కడికి చేరుకున్నాక సమావేశం ప్రారంభమైనప్పటికీ.. వేచి ఉండాలని సూచించారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన సీఎం, చీఫ్ సెక్రటరీ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురు చర్చించారు. నష్టంపై నివేదికను మోదీకి దీదీ సమర్పించారు. ఆయన అనుమతి తీసుకుని దీఘాకు బయలుదేరి వెళ్లారు. దీఘాలోనూ సమావేశం ఉన్నట్లు మోదీ కూడా చెప్పారు. ' అని తెలిపారు.
మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన దీదీ.. ఇతర సమావేశాలు ఉండటం వల్లే ప్రధానితో భేటీని తొందరగా వీడినట్టు తెలిపారు.
"ప్రధాని సమావేశానికి పిలుపునిచ్చారు. కానీ, దీఘాలో మీటింగ్ ఉందని నాకు తెలియదు. కలైకుండాకు వెళ్లి మోదీకి నివేదిక సమర్పించాను. దీఘా అభివృద్ధికి రూ.20వేల కోట్లు, సుందర్బాన్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలని కోరాను. రాష్ట్ర అధికారులు నాతో కలవాలనుకుంటున్నట్లు ఆయనతో చెప్పాను. ఆయన అనుమతి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
రూ.1000 కోట్ల సాయం..
మరోవైపు యాస్ తుపాను ప్రభావంపై రెండు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని మోదీ తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు. అందులో రూ.500 కోట్లు ఒడిశాకి మిగిలిన రూ.500 కోట్లు బంగాల్, ఝార్ఖండ్‌కు ఇవ్వనున్నట్లు పీఎంఓ తెలిపింది. జరిగిన నష్టాన్ని బేరీజు వేసి ఈ నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అలాగే.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు ప్రధాని.
ఇదీ చూడండి: 'భారత్‌లో డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి'