మమత ఘన విజయం..
భవానీపుర్ ఉపఎన్నికలో(Bhabanipur by poll) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విజయ ఢంకా మోగించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.
భవానీపుర్‌లో(Bhabanipur by poll) దీదీకి అసలు ఎదురే లేదని ఈ ఉప ఎన్నికతో మరోసారి నిరూపితమైంది. తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారు దీదీ. ఆ తర్వాత రౌండ్ రౌండ్‌కూ మెజారిటీ పెరుగుతూ వచ్చింది. తొలిరౌండ్ పూర్తయ్యే సరికి.. 3,680, రెండో రౌండ్ తర్వాత 3,861, నాలుగో రౌండ్ అనంతరం 12,435 మెజారిటీ సంపాదించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగింది. సెప్టెంబర్ 30న ఈ భవానీపుర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 53 శాతం పోలింగ్ నమోదైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.