ఏడాది క్రితం తప్పిపోయిన ఓ బాలుడ్నిఫేస్బుక్ మెసెంజర్ సహాయంతో తల్లిదండ్రులు చెంతకు చేర్చారు కొందరు బెంగళూరు యువకులు. దీంతో తమ కన్నబిడ్డను ఏడాది తర్వాత చూసిన తల్లిదండ్రులు పిల్లాడిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ యువకులకు జీవితాంతం రుణపడి ఉంటామని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే?.. బంగాల్‌కు చెందిన సుహాస్ అనే బాలుడు.. ఏడాది క్రితం తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుకుంటూ రైలు ఎక్కాడు. ఆ తర్వాత రైలు కదలింది. ఏం చేయాలో తెలియని ఆ పిల్లవాడు ఆ రైలులోనే బెంగళూరు స్టేషన్‌కు చేరుకున్నాడు.
15 రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఓ బేకరీ ముందు ఆకలితో అలమటిస్తూ కూర్చున్నాడు. బాలుడ్ని బేకరీ యజమాని రాజన్న, నితిన్, శ్రీధర్ గమనించారు. వివరాలు ఆరా తీయగా పిల్లవాడు తనకేం గుర్తులేవని హిందీలో చెప్పాడు. అతడి అన్నయ్య పేరు మాత్రమే చెప్పాడు. వెంటనే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఆ పేరును సెర్చ్ చేసి ఫొటోను చూపించారు. బాలుడు.. తన అన్నయ్యను గుర్తుపట్టాడు. వెంటనే ఆ యువకులు సుహాస్ సోదరుడ్ని సంప్రదించారు. వచ్చి తన తమ్ముడ్ని తీసుకెళ్లమని చెప్పారు.
ఆ తర్వాత సుహాస్‌కు ఆ యువకులు బేకరీలో పడుకోవడానికి గది, ఆహారం ఏర్పాటు చేశారు. హెయిర్ కట్ కూడా చేయించారు. అతడి తల్లిదండ్రులు వచ్చేవరకు సొంత తమ్ముడిలా చూసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సుహాస్ తల్లిదండ్రులు బెంగళూరు వచ్చారు. పిల్లాడిని చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తమతో పాటు బంగాల్ తీసుకెళ్లారు. ఈ విషయమంతా తెలుసుకున్న ప్రజలు.. రాజన్న, నితిన్, శ్రీధర్‌ను ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 12వేల దిగువకు కేసులు
ఫడణవీస్‌తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!