బంగాల్ శాసనసభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 79.08 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు.
కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ.
పలు చోట్ల ఉద్రిక్తత
జగ్ద్దాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు పోలింగ్ ఏజెంట్లు కనబడకుండా పోయారని టీఎంసీ ఆరోపించింది. ఫోన్ ద్వారాను వారి ఆచూకీ లభించటం లేదని పేర్కొంది. జిల్లాలోని మేఘ్నా ప్రాంతంలో బాంబు దాడులు జరిగిన క్రమంలో వారు గల్లంతైనట్లు తెలిపింది.
మరోవైపు.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అధికార టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టాయి. జిల్లాలోని అందాంగలో 131, 132 పోలింగ్ బూత్‌లలో డ్రోన్ల సాయంతో నిఘా వేశారు అధికారులు. జిల్లాలోని తితాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర దినాజ్పుర్లోని ఖునియా గ్రామంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు.
మే 2న ఫలితాలు..
బంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఏడో దశ ఏప్రిల్ 26న, చివరి దశ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: బంగాల్లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు