తృణమూల్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించారు. గాయం కారణంగా కాస్త విరామం ఇచ్చిన ఆమె.. వీల్ ఛైర్‌లోనే ప్రచారం చేపట్టారు. కాలి నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ.. నా ప్రజలు ఇంతకంటే తీవ్రంగా బాధపడుతున్నారు కాబట్టి పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలో నిర్వహించిన భారీ రోడ్ షో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపైనా, భాజపాపైనా తీవ్ర విమర్శలు చేశారు.
"మన పుణ్యభూమిని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ బాధలు మరింత పెరిగినా, పిరికిపందలా మాత్రం ఎవరికీ తలవంచం" అని అంతకుముందు మమత ట్వీట్ చేశారు. అనంతరం కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నానని, అయితే, ఎవరికీ తలొగ్గలేదని అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ గాయపడిన పులి మరింత ప్రమాదకరమని అన్నారు. వీల్ ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొననసాగిస్తానని స్పష్టం చేశారు.
"ఈరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని వైద్యులు నాకు సూచించారు. అయినా నేను తప్పకుండా ర్యాలీలో పాల్గొనాలనుకున్నా. ఎందుకంటే నా కాలి గాయం కారణంగా ఇప్పటికే మనం కొన్ని రోజులు కోల్పోయాం. నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు. ప్రజలు పడుతున్న ఈ బాధతో పోలిస్తే, నేను పడుతున్న ఈ బాధ అంత తీవ్రమైనదేమీ కాదు" అని మమత పేర్కొన్నారు. మమతా బెనర్జీ 'బంగాల్ బిడ్డ' అంటూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో రోడ్‌షో మార్మోగింది. మరోవైపు దాడి చేయటం వల్ల మమత కాలికి గాయమవలేదని, సిబ్బంది వైఫల్యం వల్లే ఆమె గాయపడ్డారని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ధారణకు వచ్చింది.
ఇదీ చదవండి:ఓవైసీ- దినకరన్ 'పొత్తు'తో ఎవరికి లాభం?