మరో దఫా చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఏ సమయంలోనైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతల నిరసనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తోమర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"రైతులతో సమావేశం కచ్చితంగా జరుగుతుంది. తేదీని నిర్ణయించేందుకు అన్నదాతలను సంప్రదిస్తున్నాం. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే. ఇక అంతా రైతుల చేతిలోనే ఉంది. తదుపరి చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించి ప్రభుత్వానికి వారే తెలియజేయాలి."
--- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి.
రైతులు-కేంద్రం మధ్య ఇప్పటివరకు ఐదు దఫాల చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చట్టాల రద్దు కుదరని పని అని తేల్చిచెప్పిన కేంద్రం.. పలు సవరణలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.
ఇవీ చూడండి:- నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట