బంగాల్లో తొలి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి చూపు ఏప్రిల్ 1న జరగనున్న రెండో దశపైకి మళ్లింది. రాజకీయంగా అత్యంత కీలకమైన, గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గం ఈ దఫాలో పోలింగ్‌కు వెళుతుండటం ఇందుకు కారణం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- భాజపా నేత సువేందు అధికారి మధ్య సమరానికి నందిగ్రామ్ వేదిక కానున్నందున మొదటి నుంచి అక్కడి వాతావరణం వాడివేడీగానే ఉంది. తాజాగా.. రాజకీయ పార్టీలు జోరును పెంచాయి. వరుస పెట్టి ప్రచారాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
మమత ఇలా...
మమతా బెనర్జీ.. ఆదివారం రాత్రి నందిగ్రామ్‌కు చేరుకోనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు అక్కడ ప్రచారాలు నిర్వహించనున్నారు.
నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మమత ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్లారు.
ఇదీ చూడండి:- బంగాల్ బరి: అలజడుల నందిగ్రామ్‌లో గెలుపెవరిది?
భాజపా సై...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నందిగ్రామ్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారీ రోడ్ షోకు కమలదళం సన్నద్ధమవుతోంది.
బాలీవుడ్ నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి కూడా సువేందు తరఫున ప్రచారం చేస్తారని తెలుస్తోంది.
సువేందు తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు ఇప్పటికే ప్రచారం చేశారు.
ఢీ అంటే ఢీ..
ఇన్నేళ్లు మమతకు నమ్మిన బంటుగా.. నందిగ్రామ్ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన సువేందు అధికారి.. ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఇందుకు మమత గట్టిగానే సమాధానమిచ్చారు. సొంత నియోజకవర్గం భవానీపొర్ను వీడి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే నందిగ్రామ్‌లో మమతపై కచ్చితంగా విజయం సాధిస్తానని సువేందు ధీమాగా ఉన్నారు.
ఇదీ చూడండి:- 'నందిగ్రామ్ రణం'లో స్వతంత్రుల ప్రభావమెంత?