జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడి సమస్యలను పరిష్కరించుకొనే శక్తిసామర్థ్యాలు దేశానికి ఉన్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కశ్మీర్‌పై తమకు సలహాలిచ్చే దేశాలు ముందుగా వారి అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
జమ్ములోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) స్నాతకోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 3, 4 బ్యాచ్‌లకు చెందిన 148 మంది ఎంబీఏ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
" శాంతితోనే ప్రగతి సాధ్యం. దేశంలోనే అందమైన ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ప్రజలకు శాంతి కావాలి. పొరుగు దేశాల వ్యక్తులు భారత్‌లో అలజడులు సృష్టించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు, వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవు. ముందు దేశం.. తర్వాత పార్టీ/వృత్తి.. చివర్లోనే నేను.. అన్న దృక్ఫథం అందరిలో రావాలి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన నూతన, సరళీకృత విధానాలతో ప్రపంచం అంతా భారత్ వైపే చూస్తోంది. పెట్టుబడులకు అత్యంత అనువైన గమ్యంగా మన దేశం మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశాన్ని శక్తిమంతంగా, శాంతియుతంగా, సుసంపన్నంగా మార్చుకోవాలి."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
ఐఐఎం వంటి విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సృజనాత్మక కోర్సులు, డిప్లమోలు తీసుకొచ్చి నాలుగోతరం పారిశ్రామిక విప్లవానికి బాటలు వేయాలన్నారు వెంకయ్య. వ్యవసాయం, వ్యాపారం, సాంకేతికత, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్ సబ్జెక్టుల మిళితంగా కొత్తతరహా ఉన్నత విద్య రావాలని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం లక్ష్యం ఇదేనని, ఎంబీఏ విద్యార్థులు రైతులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను మెరుగుపరచాలని వెంకయ్య కోరారు.
ప్రధాని మోదీ పాలనలో గత ఏడేళ్లలోనే జమ్ము ప్రాంతం ఉత్తర భారతదేశానికి విద్యాకేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: 44 స్థానాలు - 373 మంది అభ్యర్థులు