Vinayaka Chavithi 2023 First Day pooja and Prasadm in Telugu: గణేష్ నవరాత్రుల్లో.. తొమ్మిది రోజుల్లోనూ ఒక్కో పేరుతో వినాయకుడిని పూజిస్తారు. రోజుకో తీరున ప్రత్యేక పూజలు చేస్తారు. పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మరి, ఈ వివరాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
Vinayaka Chavithi 2023 First Day pooja and Prasadm : మొదటి రోజున గణపతిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా.. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో పూజించాలి. తెల్లవారు జామునే లేచి ఇంటిని, పూజ గదిని శుభ్రపరిచి.. తలస్నానం చేయాలి. నూతన వస్త్రాలు ధరించి.. ఇంటినీ, పూజా మందిరాన్నీ పసుపు, కుంకుమ, తోరణాలతో అందంగా అలంకరించాలి. కుటుంబమంతా కలిసి కూర్చొని పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచి.. దానిపైన పాలవెల్లి కట్టి ఆపై వినాయకుడికి ఇష్టమైన పండ్లను ఉంచి.. గణపతిని షోడశ లేదా అష్టోత్తర శత నామాలతో, అలాగే 21 రకాల పత్రాలతో పూజించాలి. వినాయక పూజ అనంతరం ప్రసాదాలు సమర్పించాలి.
Vinayaka Chavithi 2023 Pooja Vidhanam Telugu : వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి..? పూజా విధానం ఏంటి..?
వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితినాడు చంద్రుణ్ని చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి విముక్తి పొందడం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకోవాలి. అక్షతలను మనమే ధరించాలి తప్ప, దేవుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. కానీ తొమ్మిది రోజులు పూజలు జరిపేవారు మాత్రం మూషికాసుర వృత్తాంతమూ తెలుసుకోవాలి.
మూషికాసుర వృత్తాంతం: దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి జీవించేవాడు. వ్యవసాయం చేసుకుంటూ భుక్తి గడుపుకొంటూ, ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. అనింద్యుడనే మూషికరాజు.. వారు కష్టపడి పండించిన పంటను హరిస్తూ ఉండేవాడు. దీంతో.. భరద్వాజ ముని సూచన ప్రకారం.. ఆ మహర్షి వినాయక వ్రతం ఆచరించసాగాడు. ఉద్యాపన చేస్తుండగా.. ఆ నివేదనలను కూడా మూషికరాజు హరించాడు. దీంతో.. "అసురుడవై జన్మించు" అని మహర్షి భార్య మూషికరాజును శపించింది. ఫలితంగా మూషికరాజు.. యక్షరాజైన కుబేరునికి కొడుకుగా జన్మించాడు. ఒకసారి తండ్రితోపాటు మణిద్వీపానికి వెళ్లాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న బంగారు పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు. దాంతో జగన్మాత కోపగించి, మూషికాసురునిగా అసురజన్మ ఎత్తుదువు గాక అని శపిస్తుంది. అంతేకాకుండా.. కామక్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసినవానికి నీవు దాసుడవు అవుతావని శపించింది. ఆ విధంగా అష్టదుష్ట శక్తులను అంతం చేసిన వినాయకుడికి.. మూషికరాజు దాసుడయ్యాడు. ఇదీ.. మూషికాసుర వృత్తాంతం.
తొలి రోజు వినాయకుడి పేరు : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు.. విఘ్నేశ్వరుడిని "వరసిద్ధి వినాయకుడు" అంటారు. ఆ పేరుతోనే పూజిస్తారు. తొలి రోజున గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్లు సమర్పిస్తారు. అయితే ఉండ్రాళ్లలో చాలా రకాలే ఉన్నాయి. అందులో ఒకటి ఎలా తయారు చేయాలో మీ కోసం...
బెల్లం-రవ్వ ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ: అరకప్పు
- బెల్లం తరుగు: అరకప్పు
- తాజా కొబ్బరి తురుము: పావుకప్పు
- పెసరపప్పు: టేబుల్‌స్పూను (అరగంట ముందు నానబెట్టుకోవాలి)
- యాలకులపొడి: పావుచెంచా
- నెయ్యి: రెండు చెంచాలు
- నీళ్లు: కప్పు
తయారీ విధానం: స్టౌ మీద బాణలిని పెట్టి రవ్వను దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక బొంబాయి రవ్వ, యాలకులపొడి, చెంచా నెయ్యి వేసుకుని బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టి దగ్గరకు అయ్యాక దింపేయాలి. వేడి పూర్తిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండ్రాళ్లలా చేసుకుని.. ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఎనిమిది నుంచి పది నిమిషాల వరకూ ఉడికించుకుని తీసుకోవాలి.
Vinayaka Chavithi Special Prasadalu Telugu: వినాయక చవితి ప్రసాదాలు.. గణపయ్యకు అత్యంత ఇష్టమైనవి ఇవే!
Vinayaka Chavithi 2023 Sep 18th or 19th?: వినాయక చవితి ఎప్పుడు..? 18నా..? 19వ తేదీనా..?