దేశంలో కరోనా టీకా వేయించుకునేందుకు గంటలకొద్ది క్యూలో నిలబడేందుకు కూడా వెనుకాడట్లేదు ప్రజలు. కానీ ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలోని అహేర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించారు. ఆరోగ్య సిబ్బంది తమకు టీకాలు వేసేందుకు వస్తున్నారని తెలిసి గ్రామం వదలివెళ్లిపోయారు. ఇంటికి తాళాలు వేసి కంటికి కనపడకుండా పరారయ్యారు.
అయితే టీకా ప్రయోజనాలను గ్రామస్థులకు అధికారులు వివరించారు. మసీదులోని మైక్ ద్వారా అందరికీ వినబడేలా చెప్పారు. ఈ ప్రకటన విన్న గ్రామస్థులు చివరకు టీకా వేయించుకునేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత మొత్తం 122మందికి ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం అహేర్ గ్రామానికి వెళ్లారు. వీరిని చూసిన ఓ సామాజిక వర్గం ప్రజలు టీకాలు వెయ్యొద్దని నిరసనకు దిగారు. టీకా వేసుకోవాల్సిందేనని ఆరోగ్య సబ్బంది తేల్చిచెప్పగానే వీరంతా ఇళ్లకు తాళాలు వేశారు. అనంతరం గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది తమ పై అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన తహసీల్దార్ అనిల్ కుమార్ గ్రామానికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధుతలతో మాట్లాడి ప్రజలను ఒప్పించి టీకా వేయించుకునేలా చేశారు.
ఇదీ చదవండి: అంత్యక్రియల్లో పాల్గొని వస్తుండగా ప్రమాదం- ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి