ఆదాయాన్ని పంచుకోవడానికి సంబంధించి మీడియాకు ప్రత్యేక చట్టాలు అవసరం ఎంతైన ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టెక్ ఆధారిత మీడియాతో సంప్రదాయ పాత్రికేయరంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటుందని తెలిపారు. పత్రికలు పెద్దఎత్తున ఖర్చు చేసి ప్రచురించిన సమాచారాన్ని సోషల్ మీడియా దోపిడీ చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ప్రసారభారతి మొట్టమొదటి ఛైర్మన్ మాధవ్ విఠల్ కామత్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నారు.
జర్నలిజం.. గతం, వర్తమానం, భవిష్యత్తు అంశంపై మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సాంప్రదాయ జర్నలిజం ఆన్‌లైన్‌లోకి వెళ్లడం ద్వారా ఆదాయ వనరులను కోల్పోయిందని అన్నారు. ఇందుకుగాను పలు దేశాలు ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలు ఆదాయాన్ని పంచుకునేలా చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు.
పాత్రికేయ రంగం మీద కామత్ ముద్ర చెరగనిది...
పాత్రికేయరంగం పై మాధవ్ విఠల్ కామత్ చెరగని ముద్ర వేశారని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రసారభారతి మొట్టమొదటి ఛైర్మన్‌గా వ్యవహరించిన వారి పాత్ర చిరస్మరణీయమన్నారు. విలువలను, సంప్రదాయాలను కాపాడుతూ కొంగొత్త ఆలోచనలు అద్దిన ఆదర్శవంతమైన పాత్రికేయునిగా కామత్ పేరు గడించారని తెలిపారు. నేటితరం జర్నలిస్టులు ఆయన రచనా పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు.