మహిళా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అంకితభావం, ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. అతివలను గౌరవించటం మనదేశ సంస్కృతి అనీ.. వారిపై ఉన్న వివక్ష రూపుమాపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
'సభకు హాజరుకండి'
రాజ్యసభ సభ్యులు సభకు హాజరై.. పార్లమెంటరీ కార్యకలాపాలను పరిశీలించాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు కోరారు. అంతేకాక పార్లమెంట్ భవనంలో ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
" గ్రంథాలయానికి వెళ్లటం అంటే.. జ్ఞానాన్ని పెంచుకోవటానికి వెళ్లినట్లే. సభకు హాజరుకావటం వల్ల సభాకార్యకలాపాలు స్పష్టమవుతాయి. అయితే.. అందరూ సభలో పాల్గొని జ్ఞానాన్ని పెంచుకోండి. గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నా."
-- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైనా.. కొంతమంది నేతలు దిల్లీలో ఉండి కూడా సభకు హాజరుకాకపోవటంపై వెంకయ్య స్పందించారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ సమావేశానికి.. భాజపాయేతర, కాంగ్రెసేతర నాయకులు హాజరుకాకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్లోని గ్రంథాలయం ఈ సంవత్సరం 100 సంవత్సరాలను పూర్తిచేసుకోబోతోంది. ఈ గ్రంథాలయంలో వందల మంది జర్నలిస్టులు రాసిన పుస్తకాలతో పాటు దాదాపు 14 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి : చమురు ధరలపై ఆందోళన- రాజ్యసభ రెండుసార్లు వాయిదా