భారత ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్గా బహుళ విధులను అలవోకగా నిర్వర్తిస్తున్నారు తెలుగుతేజం ఎం.వెంకయ్య నాయుడు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యులు సైతం అత్యున్నత పదవులు అధిరోహించగలరని నిరూపించిన ఆయన పదవులకే వన్నెతెచ్చారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి భారత ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కార్యాలయం గతేడాది కాలంగా ఆయన పాల్గొన్న సభలు, సమావేశాలు, కలిసిన వ్యక్తులు, తీసుకున్న నిర్ణయాలతో కూడిన సమాచారాన్ని ఇ-బుక్ రూపంలో విడుదల చేసింది. రాజ్యసభ ఛైర్మన్గా, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆ పుస్తకం శ్లాఘించింది. అందులోని మరిన్ని అంశాలను మీరూ చదివేయండి..
మెరుగైన రాజ్యసభ పనితీరు..
- కొవిడ్-19 మహమ్మారి విజృంభణలోనూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలసి పార్లమెంటు నిర్వహణకు ఉపరాష్ట్రపతి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రాజ్యసభ పనితీరు 2017-18లో 48.17 శాతం నుంచి 2020-21 (2021 బడ్జెట్ సమావేశాల వరకు) లో 95.82 శాతానికి పెరిగింది.
- ఉపరాష్ట్రపతి సారథ్యంలో రాజ్యసభ అధికారిక టీవీ ఛానల్ ఆర్‌ఎస్‌టీవీ సరికొత్త శిఖరాలను చేరింది. గడచిన నాలుగేళ్లలో ఆర్‌ఎస్‌టీవీ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఐదు లక్షల నుంచి 59 లక్షలకు పెరిగారు.
- 2020-21 మధ్యకాలంలో.. రాజ్యసభ 44 బిల్లులకు ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అత్యధికంగా ఎనిమిది రాజ్యసభ కమిటీలు 74 నివేదికలను సమర్పించాయి.
- దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగానూ, వర్చువల్గానూ 133 కార్యక్రమాలకు హాజరయ్యారు. వీటిలో ఇరవై రెండు ప్రారంభోత్సవాలున్నాయి.
- గతేడాది కాలంలో.. ఉప రాష్ట్రపతి 53 ఉపన్యాసాలు ఇచ్చారు. 23 పుస్తకాలను విడుదల చేశారు. 21కి పైగా సంస్థలను సందర్శించారు. వీటిలో ఏడు సమావేశాల్లో ప్రసంగించారు. నాలుగు అవార్డు ప్రదాన వేడుకలకు హాజరయ్యారు. మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
కరోనా కష్ట కాలంలోనూ..
- కరోనాతో తలెత్తిన ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో.. రచనలు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు ద్వారా దేశ పౌరుల్లో భరోసా, ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఉపరాష్ట్రపతి. కరోనా నిబంధనలను పాటించాల్సిందిగా ప్రజలకు అనునిత్యం విజ్ఞప్తి చేశారు.
- సామాజిక మాధ్యమాల వేదికగా కరోనా యోధులు అందించిన సహకారాన్ని ఉపరాష్ట్రపతి అనేక సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రశంసించారు. టీకాలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు వ్యాక్సిన్ తీసుకుని ప్రజల్లో ధైర్యం నింపిన మొదటి వ్యక్తిగా నిలిచారు.
- హైదరాబాదులోని భారత్ బయోటెక్ టీకా తయారీ కేంద్రం సందర్శన సందర్భంగా.. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్ను దేశీయంగా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు.
- అనేక శాస్త్ర సాంకేతిక సంస్థలను సందర్శించిన ఉపరాష్ట్రపతి పరిశోధన, అభివృద్ధిలో వస్తున్న కొత్త పరిణామాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
దేశ చరిత్రపై మక్కువ..
- స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి వెలుగులోకి రాకుండా ఉన్న 26 మంది మహిళా యోధులపై ఫేస్బుక్లో ప్రత్యేకంగా రాసుకొచ్చారు. నాటి ఉద్యమంలో పాల్గొని అండమాన్ జైలుకి వెళ్లిన 10 మంది ఖైదీల గురించి కథనాలను రాశారు.
- 'దండి సత్యాగ్రహం' గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ముగింపు వేడుకలో ప్రసంగించారు.
మాతృభాష ఆయువు పట్టు..
- మాతృభాషల ప్రాముఖ్యతను తెలిపేవారిలో ఉపరాష్ట్రపతి ముందుంటారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి భారతీయ భాషలను ప్రోత్సహించాలని పట్టుదలగా ఉంటారు. 'ప్రతీ వేదికపైనా ఈ అంశాన్ని లేవనెత్తుతుంటారు'ని ఈ పుస్తకం తెలిపింది. ఎంపీలందరికీ భారతీయ నూతన సంవత్సర శుభాకాంక్షలను తమ మాతృభాషల్లోనే తెలిపారు.
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి 22 భారతీయ భాషలలో ట్వీట్ చేశారు. 24 వార్తాపత్రికలలో వ్యాసాలు రాశారు. మాతృభాషా పరిరక్షణ కోసం కృషి చేయాలని ఎంపీలందరికీ వారి భాషలోనే లేఖలు పంపారు.
- వృత్తివిద్యా కోర్సులను భారతీయ భాషల్లోనే అందించాలన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసిటీఈ) నిర్ణయాన్ని ప్రశంసించారు.
దౌత్య సంబంధాల బలోపేతం..
దౌత్య సంబంధాలలో భాగంగా.. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) దిల్లీలో నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ 19వ సమావేశానికి అధ్యక్షత వహించారు.
బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లాతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డువార్టే పచెకోలతో సమావేశమయ్యారు.
ఇవీ చదవండి: తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం