కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత టీకా విధానం సోమవారం నుంచి అమలైన నేపథ్యంలో వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ పుంజుకుంది. ఒక్కరోజే 86.16 లక్షలకుపైగా టీకా డోసులను పంపిణీ చేశారు. ఒక్కరోజులో ఇన్ని డోసుల పంపిణీ జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు అత్యధికంగా ఏప్రిల్ 1న 48 లక్షల డోసులు పంపిణీ జరిగింది. సగటున రోజుకు 31 లక్షల డోసుల పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మొత్తం 28.36 కోట్ల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) వెల్లడించింది.
అభినందనలు..
సోమవారం జరిగిన విస్తృత వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్పందించారు.
''ఈ రోజు రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ పట్ల సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సినే మన ప్రధాన ఆయుధం. టీకా తీసుకున్న వారికి.. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు నా అభినందనలు. పేదలు, మధ్య తరగతి, యువతే ప్రధానంగా ఈ విడత వ్యాక్సినేషన్ జరుగుతోంది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.''
-నరేంద్ర మోదీ, ప్రధాని
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానంలో భాగంగా 75 శాతం టీకాలను కేంద్రమే ఉచితంగా అందిస్తుంది. 25 శాతం టీకాలను ప్రైవేటుకు కేటాయిస్తోంది. అంతకుముందు కేవలం 50 శాతం మాత్రమే ఉచితంగా పంపిణీ చేసేది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ విధానంలో మార్పులు చేసింది.
సంతాన సాఫల్యతకు ముప్పు లేదు..
కరోనా టీకా తీసుకునే పురుషులు, మహిళలు వంధ్యత్వం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Health Ministry) ఖండించింది. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పునరుద్ఘాటించింది. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు.. మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఓ ప్రకటనలో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
టీకా సమర్థం..
కొవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అవి సమర్థంగా పనిచేస్తున్నాయని తేల్చిచెప్పింది. అందుకే పాలిచ్చే తల్లులకూ టీకా ఇవ్వడానికి 'నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19 (నెగ్‌వ్యాక్)' సిఫార్సు చేసినట్లు తెలిపింది.
ఒక్కరోజులో ఇదే రికార్డు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మధ్యప్రదేశ్లో ఒక్కరోజే 16,73,858 టీకా డోసులు అందించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : రూ.4లక్షల కరోనా పరిహారంపై తీర్పు వాయిదా