Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్లో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. జనవరి తొలి వారం నుంచి ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 14 సార్లు భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 2 నుంచి 4.5 తీవ్రతతో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఇప్పటివరకు తీవ్రంగా నష్టం జరిగిన దాఖలాలు లేనప్పటికీ.. ముప్పు మాత్రం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో పెద్ద భూకంపాలు రావొచ్చని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్త డాక్టర్ సుశీల్ కుమార్ హెచ్చరించారు.
'ఏటా 40-50 మిల్లీ మీటర్ల మేర భారత భూభాగం.. యూరేషియా భూభాగం వైపు కదులుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ రెండు భూభాగాల మధ్య ఉంది. అందువల్ల, ఈ భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. త్వరలో పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా ఇవి రావచ్చు. వీటి తీవ్రత ఎంత ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. దీన్నివల్ల ఏర్పడే నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి' అని సుశీల్ కుమార్ పేర్కొన్నారు.
భూకంపాలను దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సుశీల్ సూచించారు. కొండప్రాంతాల్లో ఉండేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. నిర్మాణాల కోసం మార్గదర్శకాలు రూపొందించి వీటిని అమలు చేసే బాధ్యతను నిపుణుల కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వానికి సూచించారు. భూకంపాన్ని తట్టుకోగలిగేలా జపాన్ వంటి దేశాల్లో నిర్మించే భవనాలను పరిశీలించాలని చెప్పారు. 'రోడ్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. 6 తీవ్రతతో భూకంపం సంభవిస్తే రోడ్లన్నీ దెబ్బతింటాయి. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది' అని పేర్కొన్నారు. వాడియా విద్యా సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోందని సుశీల్ తెలిపారు. భూకంపాలను పసిగట్టి ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థను రూపొందించడంపై పనిచేస్తోందని వెల్లడించారు. ఇందుకోసం 17 సెసిమోగ్రాఫ్ బ్రాడ్బ్యాండ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇవీ చదవండి:
దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు.. భయంతో జనం పరుగులు